కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ అభివృద్ధిలో అరబిందో 

8 Aug, 2020 08:55 IST|Sakshi

హైదరాబాద్‌: ఔషధ తయారీ సంస్థ అరబిందో ఫార్మా పలు వైరస్‌లకు సంబంధించిన  వ్యాక్సిన్ల అభివృద్ధిలో నిమగ్నమైంది. ఇందులో కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ కూడా ఒకటని కంపెనీ తెలిపింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ ఫండింగ్‌కు తమ వ్యాక్సిన్‌ క్యాండిడేట్‌ ఎంపిక అయినట్టు వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ అనుబంధ కంపెనీ ఆరో వ్యాక్సిన్స్‌ ద్వారా ప్రొఫెక్టస్‌ బయోసైన్సెస్‌ ఆర్‌అండ్‌డీ ఆస్తులను కొనుగోలు చేశామని, తద్వారా వ్యాక్సిన్ల విభాగంలో బలం పెంచుకున్నామని వివరించింది. కంపెనీ బృందం ఈ ఆర్‌అండ్‌డీని వినియోగించి వ్యాక్సిన్లకు రూపకల్పన చేస్తోందని తెలిపింది.

నిమోనియా బారిన పడకుండా ఇచ్చే న్యూమోకాకల్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌ను సైతం కంపెనీ అభివృద్ధి చేస్తోంది. ఈ ఉత్పాదన మార్కెట్‌ విలువ ప్రపంచవ్యాప్తంగా 6.2 బిలియన్‌ డాలర్లు. ఫేజ్‌–1, ఫేజ్‌–2 పూర్తి అయిందని, ఫేజ్‌–3 క్లినికల్‌ స్టడీ ఈ ఏడాది డిసెంబరులో ప్రారంభించనున్నట్టు అరబిందో వెల్లడించింది. 2021–22లో ఈ వ్యాక్సిన్‌ విడుదల చేసే అవకాశం ఉందని తెలిపింది. ఓరల్స్‌ తయారీకై చైనాలో, ఇంజెక్టేబుల్స్, ప్యాచెస్, టాపికల్స్, ఇన్‌హేలర్స్‌ వంటి ఉత్పత్తుల తయారీకై భారత్‌తోపాటు యూఎస్‌లో కొత్తగా ప్లాంట్లను స్థాపిస్తోంది. నూతనంగా ఏర్పాటైన బయోసిమిలర్స్, వ్యాక్సిన్స్‌ తయారీ యూనిట్లు కార్యకలాపాలకు సిద్ధమయ్యాయి.  (మా సత్తా ఏంటో తెలిసింది!)

మరిన్ని వార్తలు