TVS iQube Review 2021: ఎన్ని డబ్బులు ఆదా చేస్తుందో తెలుసా ?

31 Jul, 2021 13:01 IST|Sakshi

పెట్రోలు ధరలు భగ్గుమంటున్నాయి. లీటరు పెట్రోలు ధర సెంచరీ దాటి పరుగులు పెడుతోంది. బండి బయటకు తీయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.  ఐదు వందల రూపాయల నోటు ఇచ్చినా  ఐదు లీటర్ల పెట్రోలు కూడా రావట్లేదు. దీంతో పెట్రోలు బండ్లకు ప్రత్యామ్నాయంగా ఈవీ స్కూటర్లను పరిశీలిస్తున్నారు. అయితే ఈవీ స్కూటర్ల వల్ల కలిగే ప్రయోజనం ఎంత అనే సందేహం చాలా మంది మదిలో మెదులుతోంది. ఈ సందేహాలకు ‘ఆటోకార్‌’  ఇలా సమాధానం ఇచ్చింది.

 

టీవీఎష్‌ ఐక్యూబ్‌
ఎలక్ట్రిక్‌ స్కూటర్ల మైలేజీ, మెయింటనెన్స్‌ తెలుసుకునేందుకు టీవీఎస్‌ ఐక్యూబ్‌ స్కూటర్‌ని పరిశీలనలోకి తీసుకున్నారు. టీవీఎస్‌ ఐక్యూబ్‌లో 2.2 కిలోవాట్‌ లిథియమ్‌ ఐయాన్‌ బ్యాటరీని ఉపయోగించారు. ఈ బ్యాటరీ ఫుల్‌ చార్జ్‌ అయ్యేందుకు ఐదు గంటల సమయం తీసుకుంటుంది. పవర్‌ మోడ్‌లో 48 కిలోమీటర్ల మైలేజీ ఏకోమోడ్‌లో 74 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. అయితే ఏకోమోడ్‌లో ఈ స్కూటర్‌ గరిష్ట వేగం గంటకు 48 కిలోమీటర్లుగా ఉంది.

30 పైసలు
బ్యాటరీని ఫుల్‌ చార్జ్‌ చేసి కంపెనీ సూచనల మేరకు టైర్లలో ఎయిర్‌ నింపి సిటీ రోడ్లపై  ఏకో, పవర్‌ మోడ్‌లలో పరుగులు తీయించగా... సగటున ఒక కిలోమీటరు ప్రయాణానికి 30 పైసలు ఖర్చు వచ్చింది. ఇదే సమయంలో లీటరు పెట్రోలు ధర రూ.107ని తీసుకుంటే పెట్రోలు ఇంజను స్కూటరు ప్రయాణానికి ఒక కిలోమీటరకు రూ. 1.80 వంతున ఖర్చు వస్తున్నట్టు ఆటోకారు పేర్కొంది. 

10 వేలకు 15 వేలు ఆదా

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న లీటరు పెట్రోలు ధర, యూనిట్‌ కరెంటు ఛార్జీలను పరిగణలోకి తీసుకుని పెట్రోలు స్కూటరు, ఈవీ స్కూటర్లను పరిశీలిస్తే...  పది వేల కిలోమీటర్లు తిరిగే సరికి  ఎలక్ట్రిక్‌ వెహికల్‌​ కేవలం పెట్రోలు రూపంలోనే రూ. 15,000 పెట్రోలు ఆదా చేసేందుకు తోడ్పడుతోంది. ఇక 50,000 కి.మీ ప్రయాణం పూర్తి చేసే సరికి రూ. 75,000ల వరకు మిగులు ఉంటున్నట్టు ఆటోకార్‌ తెలిపింది. పైగా ఈవీ వెహికల్స్‌కి ఆయిల్‌ ఛేంజ్‌, ఫిల్టర్లు ఇలా మెయింటనెన్స్‌ ఖర్చు కూడా తక్కువే. 

ఈవీకి డిమాండ్‌
పెట్రోలు రేట్లు పెరిగిపోతుండటంతో ఈవీ స్కూటర్లకు దేశంలో డిమాండ్‌ పెరుగుతోంది. ఇప్పటికే పలు బ్రాండ్లు ఈవీలను మార్కెట్‌లోకి తీసుకురాగా.. ఓలా స్కూటర్‌కి అయితే ప్రీ బుకింగ్స్‌లో ప్రపంచ రికార్డు సాధించింది. 
 

మరిన్ని వార్తలు