అలా చేస్తే సగం ధరకే పెట్రోల్‌, డీజిల్‌..!

13 Mar, 2022 16:06 IST|Sakshi

అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరల్లో మార్పులు ప్రపంచదేశాలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.ఇక రష్యా-ఉక్రెయిన్‌ వార్‌తో క్రూడాయిల్‌ ధరలు కొత్త గరిష్టాలను తాకాయి. కాగా భారత ప్రభుత్వం క్రూడాయిల్‌ ధరల నుంచి ఉపశమనం పొందేందుకుగాను ఫ్లెక్స్‌ ఫ్యుయల్‌(మిశ్రమ ఇంధనం) వాహనాల తయారీపై ముమ్మర ప్రయత్నాలను చేస్తోంది. ఫ్లెక్స్‌ ఫ్యుయల్‌ వాహనాల తయారీపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలను చేశారు. 

తయారీకి సిద్దం..!
వచ్చే ఆరు నెలల్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల తయారీని ప్రారంభిస్తామని ఆటోమొబైల్ కంపెనీల ఉన్నతాధికారులు తనకు హామీ ఇచ్చారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శనివారం తెలిపారు. ఈటీ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌ను ఉద్దేశించి గడ్కరీ మాట్లాడుతూ...100 శాతం స్వచ్ఛమైన ఇంధన వనరుల నుండి ప్రజా రవాణాను నడిపేందుకు ప్రభుత్వం ప్రణాళికపై పని చేస్తుందని చెప్పారు. వాహన దారులకు సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే సగం ధరకే ఇంధనం లభిస్తోందని గడ్కరీ అభిప్రాయపడ్డారు.  

త్వరలో 100 శాతం ఇథనాల్‌తో..
ఫ్లెక్స్‌ ఫ్యుయల్‌ వాహనాల తయారీ నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పలు ఆటోమొబైల్‌ కంపెనీలతో సమావేశాలను ముమ్మరం చేశారు. గత వారం అన్ని ప్రధాన ఆటోమొబైల్ కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్లు సియం(ఎస్‌ఐఏఎం) ప్రతినిధులతో సమావేశమయ్యానని తెలిపారు.  ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్‌ల తయారీని త్వరలోనే ప్రారంభిస్తామని ఆయా కంపెనీలు హామీ ఇచ్చారన్నారు. ఇక భవిష్యత్తులో దేశవ్యాప్తంగా వాహనాలు 100 శాతం ఇథనాల్‌తో నడుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రీన్ హైడ్రోజన్,  ఇతర ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. కాగా టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో వంటి కంపెనీలు ఇప్పటికే ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాల కోసం ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ల తయారీని ప్రారంభించాయని ఆయన గుర్తుచేశారు. 

ఫ్లెక్స్‌ ఫ్యుయల్‌ అంటే..!
ఫ్లెక్స్-ఫ్యుయల్‌ అనేది గ్యాసోలిన్ ,మిథనాల్ లేదా ఇథనాల్ మిశ్రమం నుంచి తయారైన ప్రత్యామ్నాయ ఇంధనం. పెట్రోల్‌లో ఇథనాల్‌ను 20 శాతం కలపడంతో ఫ్లెక్స్‌ ఫ్యుయల్‌ తయారవుతుంది. పెట్రోల్‌ కంటే దీని ధర తక్కువగా ఉంటుంది. ఇప్పటికే మహారాష్ట్రలో చాలా చోట్ల ఇథనాల్ కలిపిన పెట్రోల్ అందుబాటులో ఉంది.దీని ధర లీటరు రూ. 70 కంటే తక్కువగా ఉంది.

చదవండి: ఫ్లీజ్‌ మోదీజీ!! మమ్మల్ని ఆదుకోండి..భారత్‌కు రష్యా బంపరాఫర్‌!

మరిన్ని వార్తలు