ఆటోమేటిక్‌ చెల్లింపులకు ఏప్రిల్‌ గండం..!

30 Mar, 2021 04:29 IST|Sakshi

వచ్చే నెల నుంచే ఆర్‌బీఐ ప్రీ–డెబిట్‌ నోటిఫికేషన్‌ అమల్లోకి

కొత్త రూల్స్‌కు ఇంకా సిద్ధం కాని బ్యాంకులు

మొబైల్, నీటి బిల్లులు తదితర పేమెంట్స్‌పై ప్రభావం

ముంబై: మొబైల్‌ బిల్లుల నుంచి కరెంటు, నీరు తదితర బిల్లుల దాకా ప్రతి నెలా జరపాల్సిన చెల్లింపుల కోసం ఆటోమేటిక్‌ విధానాన్ని పాటిస్తున్న కస్టమర్లు రాబోయే ఏప్రిల్‌లో సమస్యలు ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) నిర్దేశించిన ప్రీ–డెబిట్‌ నోటిఫికేషన్‌ నిబంధనలు ఏప్రిల్‌ నుంచి అమల్లోకి రానుండటం, బ్యాంకులు.. కార్డు సంస్థలు మాత్రం ఇంకా వీటిని పాటించేందుకు పూర్తిగా సన్నద్ధంగా లేకపోవడం ఇందుకు కారణం. దీని వల్ల నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ వంటి ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) స్ట్రీమింగ్‌ సర్వీసులకు, భారతి ఎయిర్‌టెల్‌.. వొడాఫోన్‌ వంటి టెల్కోలకు, టాటా పవర్‌ వంటి విద్యుత్‌ సంస్థలకు ఆటోమేటిక్‌ విధానంలో బిల్లులు కడుతున్న కస్టమర్లు ఇబ్బందులు పడనున్నారని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

మార్చి 31 డెడ్‌లైన్‌..
సాధారణంగా ప్రతి నెలా జరపాల్సిన చెల్లింపుల కోసం పలువురు బ్యాంక్‌ కస్టమర్లు  ఆటోమేటిక్‌ డెబిట్‌ విధానం ఎంచుకుంటూ ఉంటారు. దీని ప్రకారం నిర్దేశిత తేదీ నాడు బ్యాంకులు ఆయా బిల్లుకు కట్టాల్సిన మొత్తాలను వారి ఖాతాల నుంచి డెబిట్‌ చేస్తుంటాయి. సాధారణ ఖాతాదారులు, చిన్న..మధ్య తరహా సంస్థలు మొదలుకుని కార్పొరేట్‌ సంస్థల దాకా పలువురు కస్టమర్లు .. నెలవారీ బిల్లుల చెల్లింపులకు ఇలాంటి ఆటోమేటిక్‌ విధానాన్నే పాటిస్తున్నారు. ఏప్రిల్‌లో ఇలాంటి లావాదేవీల పరిమాణం సుమారు రూ. 2,000 కోట్ల పైచిలుకు ఉంటుందని అంచనా. ఇంత కీలకంగా ఉన్న ఆటోమేటిక్‌ డెబిట్‌ లావాదేవీలకు సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కొత్త నిబంధనలు రూపొందించింది. వీటి ప్రకారం... ఇకపై ఇలా పేమెంట్‌ జరిపే తేదీకి అయిదు రోజులు ముందే కస్టమరుకు బ్యాంకులు డెబిట్‌ లావాదేవీ గురించి నోటిఫికేషన్‌ పంపాల్సి ఉంటుంది. కస్టమరు అనుమతించిన తర్వాతే డెబిట్‌ చేయాల్సి ఉంటుంది. ఇక రూ. 5,000 దాటిన రికరింగ్‌ చెల్లింపుల కోసం ఖాతాదారుకు వన్‌–టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) కూడా పంపాల్సి ఉంటుంది.

ప్రత్యామ్నాయాలపై దృష్టి ..
2019 ఆగస్టులో ఆర్‌బీఐ ప్రతిపాదించిన ఈ నిబంధనలు ఏప్రిల్‌ 1తో మొదలయ్యే వచ్చే ఏడాది (2021–22) నుంచి అమల్లోకి వస్తున్నాయి. బ్యాంకులు, కార్డ్‌ నెట్‌వర్క్‌లు, ఆన్‌లైన్‌ విక్రేతలు తదితర వర్గాలు వీటిని కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. అయితే, పలు దిగ్గజ బ్యాంకులు, సంస్థలు ఈ నిబంధనలను పాటించేందుకు అవసరమైన ఏర్పాట్లు ఇంకా పూర్తి చేసుకోలేదని చెబుతున్నాయి. ఇందుకు సంబంధించి ’స్టాండింగ్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌’ను అమలు చేయలేమంటూ కస్టమర్లకు బ్యాంకులు సమాచారం ఇస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

దీంతో ఎస్‌బీఐ, యాక్సిస్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ వంటి బ్యాంకులతో పాటు ఎమెక్స్‌ వంటి కార్డ్‌ సంస్థలూ ఆటోమేటిక్‌ లావాదేవీలను తిరస్కరించే అవకాశం ఉం ది. ఈ నేపథ్యంలో  డెబిట్‌/క్రెడిట్‌ కార్డులు మొదలైన వాటి ద్వారా ఆటోమేటిక్‌గా చెల్లింపులు జరుగుతున్న సర్వీసులకు పేమెంట్‌ నిల్చిపోయి, సేవలకు విఘాతం ఏర్పడే పరిస్థితి నెలకొంది. దీంతో చెల్లింపులకు ప్రత్యామ్నాయ మార్గాలపై కస్టమర్లు దృష్టి పెట్టాల్సి రానుంది. వ్యక్తిగతంగా ఆయా సంస్థల వెబ్‌సైట్ల ద్వారా పేమెంట్స్‌ చేయాల్సి రావచ్చని పరిశ్రమవర్గాలు అంటున్నాయి.
 

మరిన్ని వార్తలు