అన్ని రుణాలూ భారమే

11 Jun, 2022 05:01 IST|Sakshi

అన్ని బ్యాంకులదీ పెంపు బాటే

ఆర్‌బీఐ రెపో రేటు పెంపు ప్రభావం

సామాన్యుడిపై ఎక్కువ భారం

న్యూఢిల్లీ: వాహన, గృహ, వ్యక్తిగత రుణాలు మరింత భారంగా మారుతున్నాయి. ఆర్‌బీఐ కీలకమైన రెపో రేటు పెంచడంతో దాదాపు అన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు రేట్లను పెంచుతూ నిర్ణయాలను ప్రకటిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు, బ్యాంకు ఆఫ్‌ బరోడా (బీవోబీ), పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ), బ్యాంకు ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ బ్యాంకు, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకుతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ ఇప్పటికే రేట్ల పెంపు అమల్లోకి తీసుకొచ్చాయి.

బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే స్వల్పకాల రుణాలపై వసూలు చేసే రేటునే రెపో రేటుగా చెబుతారు. ప్రస్తుతం బ్యాంకులు ఎక్కువగా రెపో ఆధారిత రేట్ల విధానాన్నే రుణాలు, డిపాజిట్లకు అనుసరిస్తున్నాయి. జూన్‌ 8నాటి సమీక్షలో ఆర్‌బీఐ అర శాతం మేర రెపో రేటును పెంచింది. దీనికి నెల ముందు 0.40 శాతం పెంచడంతో నెలన్నర వ్యవధిలోనే 0.90 శాతం రేటు పెంపు అమల్లోకి వచ్చింది. ఉక్రెయిన్‌–రష్యా మధ్య యుద్ధంతో కమోడిటీల ధరలు అదుపు తప్పాయి. అంతర్జాతీయంగా ఆహార సరఫరాలో సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో ద్రవ్యోల్బణం నియంత్రణ పరిధి దాటిపోయింది. ఫలితంగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్‌బీఐ రేట్ల పెంపు బాట పట్టింది.

ఒక్కో బ్యాంకు..  
► ఐసీఐసీఐ బ్యాంకు రెపో అనుసంధానిత ‘ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ లెండింగ్‌ రేటు’ (ఈబీఎల్‌ఆర్‌)ను 8.10 శాతం నుంచి 8.60 శాతం చేస్తున్నట్టు ప్రకటించింది. జూన్‌ 8 నుంచి కొత్త రేటు అమల్లోకి వచ్చింది.
► పీఎన్‌బీ రెపో లింక్డ్‌ లెండింగ్‌ రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌)ను 6.90% నుంచి 7.40% చేసింది.  
► బ్యాంకు ఆఫ్‌ బరోడా సైతం ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ను 7.40 శాతానికి సవరించింది.  
► ఎస్‌బీఐ ఈబీఎల్‌ఆర్‌ రేటును 7.05 శాతానికి సవరిస్తూ ఆర్‌బీఐ జూన్‌ పాలసీకి ముందే నిర్ణయాన్ని ప్రకటించింది. దీనికి క్రెడిట్‌ రిస్క్‌ ప్రీమియం కూడా కలిపి రుణాలపై వడ్డీ రేటును అమలు చేయనుంది.
► హెచ్‌డీఎఫ్‌సీ.. రిటైల్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటు (ఆర్‌పీఎల్‌ఆర్‌)ను గృహ రుణాలపై అర శాతం పెంచింది. ఇది జూన్‌ 10 నుంచి అమల్లోకి వచ్చింది. 20 ఏళ్ల కాల గృహ రుణాలపై ప్రతీ రూ.లక్షకు రూ.31 పెరిగినట్టయింది.  
► ఇండియన్‌ బ్యాంకు ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ను 7.70 శాతానికి, బ్యాంకు ఆఫ్‌ ఇండియా 7.75 శాతానికి పెంచాయి.  
► ఐఓబీ ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ను జూన్‌ 10 నుంచి 7.75%కి సవరించినట్టు తెలిపింది.
► బ్యాంకు ఆఫ్‌ మహారాష్ట్ర సైతం ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ను 7.20 శాతం నుంచి 7.70 శాతానికి సవరించినట్టు, ఇది తక్షణమే అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది. మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ఆధారిత లెండింగ్‌ రేటు (ఎంసీఎల్‌ఆర్‌) రుణాలపైనా 0.30% మేర రేటును పెంచింది.
► కెనరా బ్యాంకు ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ను 7.35 శాతం నుంచి 7.40 శాతం చేస్తూ, జూన్‌ 7 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది.  
► 2019 అక్టోబర్‌ 1 నుంచి రెపో, ట్రెజరీ బిల్లు ఈల్డ్‌  ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ లెండింగ్‌ రేటును బ్యాంకులు  అమలు చేస్తున్నాయి. అంతక్రితం ఎంసీఎల్‌ఆర్‌ విధానం ఉంది.

మరిన్ని వార్తలు