ఇంధన భద్రతలో ఆటో ఎల్‌పీజీ కీలకపాత్ర

29 Dec, 2022 06:13 IST|Sakshi

పరిశ్రమ సమాఖ్య ఐఏసీ వెల్లడి

న్యూఢిల్లీ: ఓవైపు అంతర్జాతీయంగా సహజ వాయువు ధరలు పెరుగుతుండగా, మరోవైపు ఎలక్ట్రిక్‌ వాహనాలను సరఫరా వ్యవస్థ సమస్యలు వెన్నాడుతున్న నేపథ్యంలో దేశీయంగా ఇంధన భద్రతను సాధించడంలో  ఆటో ఎల్‌పీజీ కీలక పాత్ర పోషించగలదని పరిశ్రమ సమాఖ్య ఐఏసీ తెలిపింది. అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్‌ తర్వాత రవాణా కోసం అత్యధికంగా ఉపయోగించే ఇంధనాల్లో ఆటో ఎల్‌పీజీ మూడో స్థానంలో ఉందని వివరించింది. దీనివల్ల గ్లోబల్‌ వార్మింగ్‌ అవకాశాలు చాలా తక్కువని ఐఏసీ పేర్కొంది.

కరోనా కారణంగా అంతర్జాతీయంగా ఇంధనాల సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతుండటం, ఇంధన ఎగుమతిలో కీలకంగా ఉంటున్న ఒక దేశం పూర్తి స్థాయి యుద్ధంలో నిమగ్నమై ఉండటం తదితర అంశాల కారణంగా ఇంధన భద్రత సాధించడం మరింత కీలకంగా మారిందని తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్‌ వాహనాలే కాకుండా ఆటో ఎల్‌పీజీ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలపై కూడా ప్రభుత్వం మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అలా కాకుండా వాటికి తగినంత గుర్తింపునివ్వకపోవడం ఆందోళన కలిగించే అంశమని ఐఏసీ డైరెక్టర్‌ జనరల్‌ సుయశ్‌ గుప్తా వ్యాఖ్యానించారు. విద్యుత్‌తో పోలిస్తే ఉత్పత్తి దశ నుంచి వినియోగం వరకూ ఎల్‌పీజీ వల్ల వచ్చే ఉద్గారాలు చాలా తక్కువని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు