ఆటో విడిభాగాల పరిశ్రమ జోరు, పీవీ - ట్రాక్టర్లకు డిమాండ్‌

27 Aug, 2021 09:16 IST|Sakshi

ముంబై: ఆటో విడిభాగాల పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22)లో మంచి వృద్ధిని చూస్తుందని.. కంపెనీల ఆదాయం 20–23 శాతం పెరగొచ్చని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. దేశీ ఆటోమొబైల్‌ రంగం కోలుకోవడానికి తోడు, ఎగుమతులు సైతం బలంగా ఉండడం వృద్ధికి మద్దతునిచ్చే అంశాలుగా పేర్కొంది. అయితే, కీలక ముడి సరుకుల ధరలు అధికంగా ఉండడం, సెమీ కండక్టర్ల కొరత పరిశ్రమను వేధిస్తున్న అంశాలుగా తెలిపింది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఆటో విడిభాగాల పరిశ్రమ మంచి రికవరీని చూసినట్టు వివరించింది. ప్రయాణికుల వాహనాలు (పీవీ), ట్రాక్టర్లకు డిమాండ్‌ బలంగా ఉందని.. కరోనా ముందస్తు నాటి డిమాండ్‌ స్థాయికి చేరుకున్నట్టు నివేదికలో పేర్కొంది. మధ్యతరహా, భారీ వాణిజ్య వాహనాల విభాగాలు సైతం కోలుకుంటున్న సంకేతాలను ఇస్తున్నాయని తెలిపింది. పెరిగిన ముడి పదార్థాల ధరలను బదలాయించినట్టయితే ఇది కూడా ఆదాయ వృద్ధికి తోడ్పడే అంశమేనని పేర్కొంది. పరిశ్రమ స్థూల మార్జిన్లు 2021–22 మొదటి మూడు నెలల్లో సీక్వెన్షియల్‌గా (మార్చి త్రైమాసికం నుంచి) మెరుగుపడినట్టు.. నివేదికలో వివరించింది. నివేదికలోని మరిన్ని అంశాలను పరిశీలిస్తే...

చదవండి : ఫేస్‌బుక్‌ సమర్పించు....వరల్డ్‌రూమ్‌

పరిశీలనలోకి తీసుకున్న 50 ఆటో పరికరాల విభాగాలను తీసుకుంటే, వార్షికంగా క్యూ1లో  పటిష్ట స్థాయిలో 140 శాతం వృద్ధి నమోదయ్యింది. లో–బేస్‌ ఎఫెక్ట్‌ నామమాత్రంగా ఉంది.
 
సీక్వెన్షెయల్‌గా చూస్తే, (మార్చి త్రైమాసికంతో పోల్చి) సెకండ్‌ వేవ్‌ సవాళ్లు ఉన్నప్పటికీ, క్షీణత 19 శాతానికి పరిమితమైంది. అంచనాలు 30 నుంచి 35 శాతం క్షీణతకన్నా ఇది ఎంతో తక్కువ.

త్రైమాసికంగా 19 శాతం క్షీణతలోనూ టైర్లు, బ్యాటరీలు వంటి విడిభాగాల క్షీణత కేవలం 13కే పరిమితమైంది.
 
 కీలక ముడిపదార్థాలు, కమోడిటీ ధరలు తీవ్రంగా ఉండడం ప్రస్తుతం ఈ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాలు.
 
గ్లోబల్‌ సెమీ కండక్టర్‌ డిమాండ్‌లో భారత్‌ ఆటోమోటివ్‌ ఇండస్ట్రీ వాటా 11 శాతం. అయితే ఇప్పుడు వీటి కొరత పరిశ్రమకు సవాలుగా మారింది. ఈ విభాగంలో ఊహించినదానికన్నా పటిష్ట రికవరీ, కొన్ని సెమీ–కండక్టర్‌ తయారీ సంస్థల్లో సరఫరాల సమస్యలు, అంతర్జాతీయంగా పెరిగిన చిప్‌ కొరత సవాళ్లు ఇక్కడ పరిశీలనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
 
పరిశ్రమలో సరఫరాల సవాళ్లు తొలగిపోలేదు. కొన్ని మోడళ్లు, వేరియెంట్లకు సంబంధించి సరఫరాలు నాలుగు నెలలకుపైగా ఆగిపోతున్న పరిస్థితి ఉంది. డిమాండ్‌ పటిష్టంగా ఉన్నప్పటికీ సరఫరాలు అందుకు తగిన విధంగా లేవు. 2021 క్యాలెండర్‌ ఇయర్‌ వరకూ ఈ పరిస్థితి కొనసాగుతునందని పరిశ్రమ ప్రతినిధులు అంచనావేస్తున్నారు.

పరిశ్రమ ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్న అంశమిది.  

కోవిడ్‌–19 సెకండ్‌వేవ్‌ వల్ల ఆటో విడిభాగాల సరఫరాదారుల్లో మెజారిటీ భాగం ఆపరేటింగ్‌ మార్జిన్లు తగ్గాయి.  

మరిన్ని వార్తలు