వాహనాల అమ్మకాల జోరు, ఎక్కువగా కొనుగోలు చేస్తున్న వెహికల్స్‌ ఇవే!

6 May, 2022 13:49 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అన్ని రకాల వాహనాల రిటైల్‌ అమ్మకాలు 2022 ఏప్రిల్‌లో 16,27,975 యూనిట్లు నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 37 శాతం అధికం. 2021 ఏప్రిల్‌తో పోలిస్తే గత నెలలో ప్యాసింజర్‌ వెహికిల్స్‌ 25 శాతం పెరిగి 2,64,342 యూనిట్లు రోడ్డెక్కాయి. ద్విచక్ర వాహనాలు 38 శాతం ఎగసి 11,94,520 యూనిట్లు అమ్ముడయ్యాయి. 

వాణిజ్య వాహనాలు 52 శాతం దూసుకెళ్లి 78,398 యూనిట్లు, త్రిచక్ర వాహనాలు 96 శాతం, ట్రాక్టర్లు 26 శాతం విక్రయాలు పెరిగాయి. 2019 ఏప్రిల్‌తో పోలిస్తే అన్ని రకాల వాహనాల మొత్తం విక్రయాలు గత నెలలో 6 శాతం తగ్గుదల నమోదైంది. ‘రష్యా– ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగడం, చైనా లాక్‌డౌన్‌లో ఉన్నందున ఆటో పరిశ్రమ సెమీకండక్టర్‌ కొరతను ఎదుర్కొంటోంది. 

మెటల్‌ అధిక ధరలు, కంటైనర్‌ కొరత ఈ రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దీంతో సరఫరా సంక్షోభం కొనసాగుతోంది’ అని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ ప్రెసిడెంట్‌ వింకేశ్‌ గులాటీ తెలిపారు.   

మరిన్ని వార్తలు