కొనసాగిన ఆటో అమ్మకాల జోరు

2 May, 2023 05:12 IST|Sakshi

ఎస్‌యూవీలకు పెరిగిన డిమాండ్‌ ప్రభావం 

పెరిగిన మారుతీ, హ్యుందాయ్, టాటా మోటార్స్‌ విక్రయాలు

దూసుకెళ్లిన ద్విచక్ర వాహనాల అమ్మకాలు

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి నెల ఏప్రిల్‌లో ఆటో అమ్మకాల్లో మెరుగైన వృద్ధి నమోదైంది. ప్రధానంగా స్పోర్ట్స్‌ యుటిలిటి వాహనాల(ఎస్‌యూవీ)కు డిమాండ్‌ కలిసొచ్చింది. దిగ్గజ కంపెనీలైన మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్‌ సంస్థలు డీలర్లకు అధిక సంఖ్యలో వాహనాలను సరఫరా చేశాయి.

మారుతీ సుజుకీ గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో మొత్తం 1,50,661 వాహనాలను విక్రయించగా, ఏప్రిల్‌లో ఈ సంఖ్య 7 శాతం మేర పెరిగి 1,60,529 యూనిట్లకు చేరింది. ‘‘చిప్‌ కొరతతో గత నెలలో కొంత ఉత్పత్తి నష్టం జరిగింది. అయితే ఎస్‌యూవీ విభాగంలో 21 శాతం వృద్ధి నమోదు కావడంతో మొత్తం అమ్మకాల పరిమాణం పెరిగింది. ద్రవ్యోల్బణ సమస్య, గ్రామీణ ప్రాంతాల్లో విక్రయాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉండటంతో రానున్న రోజుల్లో సెంటిమెంట్‌ స్తబ్ధుగా ఉండొచ్చు’’ అని ఎంఎస్‌ఐ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు.

► ద్విచక్ర వాహన విక్రయాలకు డిమాండ్‌ కొనసాగడంతో చెప్పుకొదగిన స్థాయిలో విక్రయాలు జరిగాయి. హీరో మోటోకార్ప్‌(5% క్షీణత)  మినహా టీవీఎస్‌ మోటార్స్, రాయల్‌ ఎన్‌ఫీల్డ్, హెచ్‌ఎంఎస్‌ఐ అమ్మకాలు వరుసగా 4%, 18%, 6% చొప్పున పెరిగాయి.  
► విద్యుత్‌ ద్విచక్ర వాహన అమ్మకాలు ఏప్రిల్‌లో గణనీయంగా తగ్గాయి. నెల ప్రాతిపదికన మార్చిలో 82,292 యూనిట్లు అమ్ముడయ్యాయి. అవి ఈ
ఏప్రిల్‌లో 62,581 యూనిట్లకు తగ్గాయి.

 

మరిన్ని వార్తలు