పండుగ సీజన్‌పై ఆటో కంపెనీల ఆశలు

6 Sep, 2021 06:35 IST|Sakshi

న్యూఢిల్లీ: చిప్‌ల కొరతతో సవాళ్లు కొనసాగుతున్నప్పటికీ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పండుగ సీజన్‌లో అమ్మకాలు మరింత మెరుగ్గానే ఉండవచ్చని ఆటోమొబైల్‌ కంపెనీలు ఆశాభావంతో ఉన్నాయి. ఓనంతో మొదలైన పండుగ సీజన్‌ నవంబర్‌లో దీపావళితో ముగియనుంది. ఇప్పటిదాకానైతే డిమాండ్‌ బాగానే ఉండటంతో, అక్టోబర్‌లో సీజన్‌ తారస్థాయికి చేరితే సన్నద్ధంగా ఉండటం కోసం డీలర్లకు సరఫరా పెంచేందుకు వాహన కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. మారుతి సుజుకీ, టయోటా కిర్లోస్కర్‌ మోటర్, మహీంద్రా అండ్‌ మహీంద్రా తదితర సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతానికైతే డిమాండ్‌ గతేడాదితో పోలిస్తే మెరుగ్గానే ఉందని మారుతి సుజుకీ ఇండియా సీనియర్‌ ఈడీ శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు.

బుకింగ్‌లు, ఎంక్వైరీలు, రిటైల్‌ విక్రయాలు గణనీయంగానే ఉంటున్నాయని.. సరఫరా తరఫునే కొన్ని సమస్యలు ఉండగా, వాటిని చక్కదిద్దుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వివరించారు. పండుగ సీజన్‌లో యుటిలిటీ వాహనాల ఆధిపత్యం కొనసాగవచ్చని, ప్యాసింజర్‌ వాహనాల విభాగంలో వీటి అమ్మకాల వాటా సగం దాకా ఉండవచ్చని మహీంద్రా అండ్‌ మహీంద్రా ఆటోమోటివ్‌ డివిజన్‌ సీఈవో వీజే నక్రా పేర్కొన్నారు. ఆరి్థక రికవరీ, వ్యక్తిగత రవాణా వాహనాల అవసరం పెరగడం, కొత్త వాహనాల ఆవిష్కరణ వంటి అంశాలతో రాబోయే రోజుల్లో డిమాండ్‌ మరింత మెరుగుపడొచ్చని టయోటా కిర్లోస్కర్‌ మోటర్‌ అసోసియేట్‌ జీఎం వి సిగమణి తెలిపారు. 

మరిన్ని వార్తలు