ఆన్‌లైన్‌లోకి ఆటో మొబైల్‌.. భారీగా నియామకాలు!

8 Sep, 2021 07:51 IST|Sakshi

‘ఆటో’ ఇండస్ట్రీలో టెకీలకు ఫుల్‌ డిమాండ్‌!

టెక్నాలజీ నిపుణుల కోసం వాహన కంపెనీల వేట

నైపుణ్యం ఉన్న టెకీలకు బంపర్‌ ఆఫర్లతో గాలం

గతంలో ఎన్నడూ లేని స్థాయిలో నియామకాలు 

సరఫరా సమస్యలు అధిగమించే ప్రయత్నాలు 

ఆన్‌లైన్‌ విక్రయాలను పెంచుకునే వ్యూహాలు 

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ కంపెనీలు టెక్‌ నిపుణుల వెంట పడ్డాయేంటి? అన్న సందేహం రాకమానదు. కానీ, కరోనా అనంతరం మారిన పరిస్థితులు, ముఖ్యంగా ఆటోమొబైల్‌ పరిశ్రమలో విప్లవాత్మక మార్పుల నేపథ్యంలో కంపెనీలు టెక్నాలజీ నిపుణులపై పెద్ద ఎత్తున ఆధారపడడం తప్పడం లేదు.

అధిక వేతనం ఆఫర్‌
ఇంతకుముందు ఎన్నడూ లేనంతగా టెక్నాలజీ నిపుణులను ఆటోమొబైల్‌ కంపెనీలు నియమించుకుంటున్నాయి. 35–40 శాతం అధిక వేతన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. పెద్ద ఎత్తున డిజిటైజేషన్‌ నడుస్తుండడం.. వినియోగదారులు ఆన్‌లైన్‌లో కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇస్తుండడం కారణంగా.. ఆన్‌లైన్‌ విక్రయాలను పెంచుకునే దిశగా కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. అదే సమయంలో సరఫరా వ్యవస్థలో సమస్యలను అధిగమించేందుకు.. కొనుగోళ్లు, తయారీ కార్యక్రమాల పర్యవేక్షణకు టెక్నాలజీయే కీలకమని అవి గుర్తించాయి.  
వీరికి డిమాండ్‌ 
టీమ్‌లీజ్‌ సంస్థ వద్దనున్న సమాచారాన్ని పరిశీలిస్తే.. ఆటోమొబైల్‌ పరిశ్రమలో ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (ఐసీటీ), డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్‌ నిపుణల నియమాకాలు కరోనా ముందు 2019తో పోలిస్తే 45 శాతం పెరగడం గమనార్హం. ‘‘గత రెండేళ్ల నుంచి వినియోగదారులు ఆన్‌లైన్‌ వేదికలపై వాహనాల గురించి తెలుసుకొని, కొనుగోలు చేయడం పెరిగింది. దీంతో ఆటోమోటివ్‌ కంపెనీలు కార్యకలాపాలను డిజిటైజ్‌ చేసి, వర్చువల్‌ విక్రయాలకు (ఆన్‌లైన్‌) వీలు కల్పించేందుకు, సౌకర్యం, సమర్థత పెంచేందుకు ఎక్కువ సమయం కృషి చేస్తున్నాయి’’ అని టీమ్‌లీజ్‌ డిజిటల్‌ ఏవీపీ (డైవర్సిఫైడ్‌ ఇంజనీరింగ్‌) మునీరా లోలివాలా చెప్పారు. వాహన తయారీదారులు తమ డీలర్‌ నెట్‌వర్క్‌ను కూడా డిజిటల్‌గా మార్చేందుకు పెట్టుబడులు పెడుతున్నాయి. ఖర్చులను తగ్గించుకోవడం, డీలర్ల స్థాయిలో వనరులను మెరుగ్గా వినియోగించుకోవడంతోపాటు.. మొత్తం కొనుగోలు ప్రక్రియను మార్చే దిశగా కంపెనీలు అడుగులు వేస్తుండడాన్ని గమనించాలి. ఇంత పెద్ద స్థాయిలో టెక్నాలజీని అందిపుచ్చుకోవడం నిపుణుల అవసరాలను గణనీయంగా పెంచినట్టు లోలివాలా చెప్పారు. డిజిటల్‌ మార్కెటింగ్, వినియోగదారుల సేవలు, వాహన ముందస్తు నిర్వహణ విభాగాల్లో నియామకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 శాతం అధికంగా ఉండొచ్చన్న అంచనాను వ్యక్తం చేశారు.  
మూడు నెలల్లోనే 18 వేల మంది.. 
ప్రస్తుత త్రైమాసికంలోనే (జూలై–సెప్టెంబర్‌) 18,000 టెక్నాలజీ ఉద్యోగాలకు డిమాండ్‌ ఏర్పడినట్టు లోలివాలా తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ సంఖ్య 25,000ను చేరుకోవచ్చని ఆమె చెప్పారు.  2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ డిమాండ్‌ 15–18 శాతం పెరగొచ్చని అంచనా వేశారు. విక్రయాలు, మార్కెటింగ్‌ విభాగాల్లో డేటా అనలిటిక్స్‌ నిపుణుల నియామకాలను పెంచినట్టు కార్ల తయారీ సంస్థలు సైతం అంగీకరిస్తున్నాయి. వినియోగదారులు డిజిటల్‌ చానళ్లవైపు మళ్లడంతో విచారణ నిర్వహణకు హైపర్‌ లోకల్‌ విధానాన్ని అనుసరిస్తున్నట్టు మారుతి సుజుకీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ తెలిపారు. ‘‘ప్రస్తుతం 35 శాతం విచారణలు (కొనుగోళ్లకు సంబంధించి వివరాలు) డిజిటల్‌ చానళ్ల నుంచే వస్తున్నాయి. గతంతో పోలిస్తే 3 శాతం పెరిగింది. లాక్‌డౌన్‌ల సమయాల్లో అయితే ఇది 50 శాతం వరకు ఉంది’’ అని శ్రీవాస్తవ వివరించారు. విక్రయాలకు సంబంధించి 26 టచ్‌పాయింట్లకు గాను 24ను డిజిటల్‌గా మార్చినట్టు.. మిగిలినవి కేవలం పరీక్షల కోసం ఉద్దేశించినవిగా  చెప్పారు. ‘‘డిజిటల్‌ టూల్స్‌తో మా ప్లాట్‌ఫామ్‌ను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాం. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో డేటాను ఉపయోగించుకుని కొనుగోలుదారులకు సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించాలన్నది మా ప్రయత్నం. ఇటువంటి అధునాతన డిజిటల్‌ టూల్స్‌ వినియోగం వల్ల సీఆర్‌ఎం కార్యకలాపాలకు సంబంధించి నియామకాల్లో డేటా అనలిటిక్స్‌కు ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తున్నాం’’ అని శ్రీవాస్తవ తెలిపారు. హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా సైతం సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌ విభాగాల్లో అధిక నైపుణ్యాలున్న వారిని నియమించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తోంది.
డిమాండ్‌ ఇలా...
- ఆటోమొబైల్‌ రంగంలో ఈ త్రైమాసికంలోనే 18,000 నిపుణులకు డిమాండ్‌ నెలకొంది.  
- ఈ ఆర్థిక సంవత్సరంలో 25,000 నియామకాలకు డిమాండ్‌ పెరగొచ్చన్న అంచనా.  
- 2022–23లో ఇటువంటి నిపుణులకు 15–18% అదనపు డిమాండ్‌ ఉండొచ్చు. 
- ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీల్లో చేయి తిరిగి నిపుణులకు డిమాండ్‌ 45 శాతం పెరిగింది. 
- 35–40 శాతం అధిక వేతనాలతో కంపెనీలు ఆఫర్లు ఇస్తున్నాయి.
చదవండి: ఉద్యోగుల కోసం పోటీ పడుతున్న కంపెనీలు

మరిన్ని వార్తలు