Ford layoffs: వేల ఉద్యోగాలకు ఎసరు..!

24 Jan, 2023 18:58 IST|Sakshi

సాక్షి, ముంబై: వేలాది ఉద్యోగాల కోతలు కేవలం ఐటీ కంపెనీలను మాత్రమే కాదు ఇతర కంపెనీల ఉద్యోగులను కూడా వణికిస్తున్నాయి. తాజాగా యూఎస్‌ బేస్డ్‌ ఆటో మేకర్‌ ఫోర్డ్‌ మోటార్‌ ఉద్యోగులకు మరోసారి షాకిస్తోంది. ఐరోపా అంతటా దాదాపు  3200 మందికి ఉద్వాసన పలకనుందన్న వార్త కలవరం రేపింది. వీరిలో ఎక్కువగా జర్మనీలోని ఉద్యోగులు ప్రభావితమైనట్టు తెలుస్తోంది.

జర్మనీలోని ఐజీ మెటల్ యూనియన్  ఉటంకిస్తూ రాయిటర్స్‌  రిపోర్ట్‌ చేసింది. దీని ప్రకారం 2,500 వరకు ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ జాబ్స్‌ , 700 వరకు అడ్మినిస్ట్రేటివ్  ఉద్యోగులను తీసివేయనుంది. జర్మన్  ప్లాంట్స్‌ ఎక్కువగా ప్రభావితం కానున్నాయి. అయితే ఈ ఉద్యోగ కోతలు అమల్లోకి వస్తే పోరాటానికి దిగుతామని   యూనియన్ బెదిరించింది.

ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలలో ఉపయోగించే మెటీరియల్‌ల కోసం పెరుగుతున్న ఖర్చులు,  అమెరికా ఐరోపా ఆర్థిక వ్యవస్థల మందగమనంతోపాటు,  వాహన తయారీదారులు ఖర్చులను తగ్గించుకోవాల్సిన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా  ఈ నెల ప్రారంభంలో టెస్లా ప్రారంభించిన ఈవీ ప్రైస్‌ వార్‌  ఈ ఒత్తిడిని మరింత పెంచిందని అంచనా .

అయితే తాజా నివేదికలపై స్పందించేందుకు జర్మనీలోని ఫోర్డ్ ప్రతినిధి నిరాకరించారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) ఉత్పత్తికి మారడానికి నిర్మాణాత్మక సర్దుబాట్లు అవసరమని  పేర్కొన్నట్టు  సమాచారం.  కాగా గత సంవత్సరం ఫోర్డ్ కంపెనీ 3వేల మందిని తొలగించింది. అయితే ఈవీ మార్కెట్‌కు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఫోర్డ్  ఆల్-ఎలక్ట్రిక్ మోడల్‌ను ఉత్పత్తి నిమిత్తం,  కొలోన్ ఫ్యాక్టరీలో తయారీని పెంచడానికి ఈ సంవత్సరం ప్రారంభంలో 2 బిలియన్ల  డాలర్ల పెట్టుబడిని ప్రకటించిన  తరువాత తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

మరిన్ని వార్తలు