వాహనాలకు పండగొచ్చింది

5 Oct, 2022 04:34 IST|Sakshi

సెప్టెంబర్‌లో 11% పెరిగిన అమ్మకాలు

14.64 లక్షల యూనిట్ల విక్రయాలు

ఎఫ్‌ఏడీఏ వెల్లడి

న్యూఢిల్లీ: తయారీ సంస్థల నుంచి డీలర్లకు సరఫరా మెరుగుపడటంతో పండుగల సీజన్‌లో వాహన పరిశ్రమ కళకళ్లాడుతోంది. కస్టమర్లకు డెలివరీలూ పుంజుకుంటున్నాయి. దీంతో గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ సెప్టెంబర్‌లో దేశీయంగా ఆటోమొబైల్‌ రిటైల్‌ అమ్మకాలు 11 శాతం వృద్ధి చెందాయి. 13,19,647 యూనిట్ల నుంచి 14,64,001 యూనిట్లకు పెరిగాయి. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ (ఎఫ్‌ఏడీఏ) మంగళవారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

పండుగల సీజన్‌ కావడంతో అక్టోబర్‌లో విక్రయాలు మరింత పుంజుకోగలవని అంచనా వేస్తున్నట్లు ఎఫ్‌ఏడీఏ ఆశాభావం వ్యక్తం చేసింది. ‘దశాబ్దకాలంలోనే ఈ పండుగ సీజన్‌ అత్యుత్తమమైనదిగా ఉండగలదని డీలర్లు అంచనా వేస్తున్నారు‘ అని పేర్కొంది.  ట్రాక్టర్లు, కొన్ని రకాల త్రిచక్ర వాహనాలు మినహా మిగతా అన్ని ప్యాసింజర్, వాణిజ్య వాహనాలు.. ద్విచక్ర వాహనాలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో మెరుగైన అమ్మకాలు నమోదు చేశాయని ఎఫ్‌ఏడీఏ తెలిపింది.

ప్యాసింజర్‌ వాహనాల రిటైల్‌ అమ్మకాలు గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే 2,37,502 యూనిట్ల నుంచి 10 శాతం వృద్ధి చెంది 2,60,556 యూనిట్లకు చేరాయి. ‘సెమీకండక్టర్ల సరఫరా మెరుగుపడి కార్ల లభ్యత పెరగడం, వినూత్న ఫీచర్లతో కొత్త వాహనాలను ఆవిష్కరించడం తదితర అంశాల కారణంగా కస్టమర్లు తమకు నచ్చిన వాహనాల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు‘ అని ఎఫ్‌ఏడీఏ ప్రెసిడెంట్‌ మనీష్‌ రాజ్‌ సింఘానియా తెలిపారు. మరోవైపు, సెమీకండక్టర్ల సరఫరా మెరుగుపడుతున్న నేపథ్యంలో అమ్మకాలకు ఊతం లభించేలా డిమాండ్‌కి అనుగుణంగా వాహనాలను అందించడంపై మరింతగా దృష్టి పెట్టాలని తయారీ సంస్థలను కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.  

మరిన్ని వివరాలు..
► సెప్టెంబర్‌లో ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లు 9 శాతం పెరిగి 9,31,654 యూనిట్ల నుంచి 10,15,702 యూనిట్లకు చేరాయి. ఎంట్రీ స్థాయి బైక్‌ల అమ్మకాలు గణనీయంగా దెబ్బతినడంతో మొత్తం టూవీలర్ల విక్రయాలపై ప్రతికూల ప్రభావం పడింది.

► వాణిజ్య వాహనాల విక్రయాలు 59,927 యూనిట్ల నుంచి 19 శాతం వృద్ధితో 71,233 యూనిట్లకు పెరిగాయి. ట్రాక్టర్ల అమ్మకాలు 53,392 నుంచి 52,595 యూనిట్లకు తగ్గాయి.

► ప్యాసింజర్‌ వాహనాల విభాగంలో కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ అమ్మకాలు 99,276 యూనిట్ల నుంచి 1,03,912 యూనిట్లకు పెరిగాయి. హ్యుందాయ్‌ 39,118, టాటా మోటార్స్‌ 36,435 కార్లు విక్రయించాయి.

► ద్విచక్ర వాహనాల విభాగంలో హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా అత్యధికంగా 2,84,160 యూనిట్లు విక్రయించింది. హీరో మోటోకార్ప్‌ 2,50,246 వాహనాల అమ్మకాలు నమోదు చేసింది. త్రిచక్ర వాహనాలకు సంబంధించి 19,474 యూనిట్లతో బజాజ్‌ ఆటో అగ్రస్థానంలో నిల్చింది.
 

మరిన్ని వార్తలు