ఎవలాన్‌ టెక్నాలజీస్‌ ఐపీవో

27 Mar, 2023 00:40 IST|Sakshi

ఏప్రిల్‌ 3–6 మధ్య ఇష్యూ

రూ. 865 కోట్ల సమీకరణ

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్‌ తయారీ సర్వీసుల కంపెనీ ఎవలాన్‌ టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. ఏప్రిల్‌ 3న ప్రారంభంకానున్న ఇష్యూ 6న ముగియనుంది. తద్వారా కంపెనీ రూ. 865 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు ఈ నెల 31న షేర్లను విక్రయించనుంది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 320 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 545 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు.

షేర్ల జారీ నిధులను రుణ చెల్లింపులు, వర్కింగ్‌ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. కాగా.. తొలుత ఐపీవో ద్వారా రూ. 1,025 కోట్ల సమీకరణకు కంపెనీ ప్రణాళికలు వేసింది. అయితే ఇష్యూ కంటే ముందుగా షేర్ల ప్లేస్‌మెంట్‌ ద్వారా రూ. 160 కోట్లు సమకూర్చుకుంది. రూ. 80 కోట్లు తాజా ఈక్విటీ, మరో రూ. 80 కోట్లు సెకండరీ షేర్ల అమ్మకం ద్వారా ఈ నిధులు అందుకుంది. వీటిలో యూనిఫై ఫైనాన్షియల్‌ ప్రయివేట్‌ లిమిటెడ్, అశోకా ఇండియా ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌ నుంచి రూ. 60 కోట్లు చొప్పున లభించగా.. ఇండియా ఎకార్న్‌ ఫండ్‌ నుంచి రూ. 40 కోట్లు సమకూరినట్లు ఎవలాన్‌ వెల్లడించింది.  

1999లో షురూ..
ఎండ్‌టుఎండ్‌ ఎలక్ట్రానిక్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ సర్వీస్‌ సొల్యూషన్లు అందిస్తున్న ఎవలాన్‌ 1999లో ఏర్పాటైంది. కంపెనీ క్లయింట్లలో క్యోసన్‌ ఇండియా, జోనర్‌ సిస్టమ్స్‌ ఇంక్, కొలిన్స్‌ ఏరోస్పేస్, ఈ ఇన్ఫోచిప్స్, యూఎస్‌ మలబార్‌ కంపెనీ, మెగ్గిట్, సిస్టెక్‌ కార్పొరేషన్‌ తదితరాలున్నాయి. యూఎస్‌తోపాటు దేశీయంగా 12 తయారీ ప్లాంట్లను నిర్వహిస్తోంది. 2021–22లో రూ. 840 కోట్ల ఆదాయం సాధించింది. 2022 జూన్‌కల్లా రూ. 1,039 కోట్ల విలువైన ఆర్డర్‌బుక్‌ను కలిగి ఉంది.

మరిన్ని వార్తలు