హైదరాబాద్‌లోనే పెద్ద సైజ్‌ అపార్ట్‌మెంట్లు

22 Jan, 2021 14:03 IST|Sakshi

10 శాతం పెరిగిన ఫ్లాట్ల విస్తీర్ణాలు

గృహ ప్రాధాన్యతలో మార్పులు

అనరాక్‌ నివేదిక

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రియల్టీ పెట్టుబడులు క్షీణిస్తుంటే.. ఫ్లాట్ల విస్తీర్ణాలు మాత్రం పెరిగాయి. గతేడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో అపార్ట్‌మెంట్‌ సగటు పరిమాణం 10 శాతం వృద్ధి చెంది 1,150 చదరపు అడుగులు (చ.అ.)లకు చేరింది. విస్తీర్ణం ఎక్కువ ఉన్న ఫ్లాట్లకు డిమాండ్‌ పెరగడమే వృద్ధికి కారణామని ప్రాపర్టీ కన్సల్టెంట్‌ అనరాక్‌ తెలిపింది. 2019లో దేశంలో సగటు ఫ్లాట్ల విస్తీర్ణం 1,050 చ.అ.లుగా ఉంది. దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే హైదరాబాద్‌లోనే అపార్ట్‌మెంట్ల సైజ్‌లు బాగా వృద్ధి చెందాయి. 2019లో నగరంలో సగటు ఫ్లాట్ల విస్తీర్ణం 1,700 చదరపు అడుగులుగా ఉండగా.. గతేడాది 3 శాతం పెరిగి 1,750 చదరపు అడుగులకు పెరిగిందని అనరాక్‌ తెలిపింది.

2016 నుంచి ప్రతి సంవత్సరం సగటు గృహ విస్తీర్ణం తగ్గుతూ వస్తుంటే.. గతేడాది మాత్రం పెరిగింది. ఆదాయ స్థోమత, నిర్వహణ చార్జీల తగ్గింపు కోసం గతంలో గృహ కొనుగోలుదారులు చిన్న సైజ్‌ అపార్ట్‌మెంట్లను ఇష్టపడేవాళ్లు. అందుకు తగ్గట్టుగానే తక్కువ ధరలతో మిలీనియల్స్‌ను ఆకర్షించేందుకు డెవలపర్లు కూడా చిన్న సైజ్‌ గృహాలనే నిర్మించేవాళ్లు. కానీ, 2020లో కోవిడ్‌–19 నేపథ్యంలో వర్క్‌ ఫ్రం హోమ్‌ ప్రారంభం కావటంతో కొనుగోలుదారుల గృహ ప్రాధాన్యతలో మార్పులు వచ్చాయని అనరాక్‌ చైర్మన్‌ అనూజ్‌ పురీ తెలిపారు. అందుకే గత నాలుగేళ్లుగా ఎన్నడూ లేనివిధంగా 2020లో అపార్ట్‌మెంట్ల విస్తీర్ణాలు పెరిగాయని ఆయన పేర్కొన్నారు.

చదవండి:
పెరిగిన హౌసింగ్‌ సేల్స్‌.. కారణాలు ఇవే!

మరిన్ని వార్తలు