కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు.! నెలకు సగటున ఎంత డేటా వాడుతున్నారో తెలుసా?

16 Mar, 2022 13:39 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌లో మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్లు గడిచిన ఐదేళ్ల కాలంలో రెట్టింపునకు పైగా పెరిగి 76.5 కోట్లకు చేరారని, 4జీ డేటా ట్రాఫిక్‌ 6.5 రెట్లు పెరిగిందని నోకియా తెలిపింది. భారత్‌లో మొత్తం డేటా వినియోగంలో 4జీ వాటా 99 శాతానికి చేరినట్టు పేర్కొంది.

ఈ ఏడాది  5జీ సర్వీసులు మొదలవుతున్నా.. వచ్చే కొన్నేళ్లపాటు మొబైల్‌బ్రాడ్‌ బ్యాండ్‌ వృద్ధికి 4జీ టెక్నాలజీ సాయంగా నిలుస్తుందని నోకియా ఎంబిట్‌ పేరుతో విడుదలైన నివేదిక తెలిపింది. ‘‘మొబైల్‌ డేటా వినియోగం 2017 నుంచి 2021 మధ్య ఏటా 53 శాతం చొప్పున కాంపౌండెడ్‌ వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్‌) నమోదు చేసింది. సగటు యూజర్‌ నెలవారీ డేటా వినియోగం మూడు రెట్లు పెరిగి 17జీబీకి చేరింది. 

మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్లు 2.2 రెట్లు అప్‌
గత ఐదేళ్లలో మొబైల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్లు 2.2 రెట్లు పెరిగారు. ఈ గణాంకాలన్నీ భారత్‌లో డేటా వినియోగం గణనీయంగా పెరిగినట్టు తెలియజేస్తున్నాయి’’ అని నోకియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్, భారత్‌ విభాగం హెడ్‌ సంజయ్‌ మాలిక్‌ తెలిపారు. మిలీనియల్స్‌ (23–38) రోజుకు 8 గంటల సమయాన్ని ఆన్‌లైన్‌లో గడుపుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. షార్ట్‌ వీడియో ఫార్మాట్, గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్‌ఫోన్ల వినియోగం ఇవన్నీ భారత్‌లో డేటా వినియోగం వృద్ధికి మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొంది. గతేడాది 16 కోట్లకు పైగా స్మార్ట్‌ఫోన్ల రవాణా జరిగిందని, ఇందులో 3 కోట్లు 5జీ ఫోన్లు ఉన్నట్టు తెలిపింది.  

మరిన్ని వార్తలు