యాక్సిస్‌ బ్యాంక్‌ క్విప్‌ షురూ- షేరు అప్‌

5 Aug, 2020 11:57 IST|Sakshi

క్విప్‌ ధర ఒక్కో షేరుకి రూ. 442.19

రూ. 10,000 కోట్ల సమీకరణ లక్ష్యం

4 శాతం జంప్‌చేసిన యాక్సిస్‌ బ్యాంక్‌ షేరు

ప్రయివేట్‌ రంగ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంక్‌.. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్లకు షేర్ల జారీ(క్విప్‌) ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించింది. ఇందుకు ఫ్లోర్‌ ధరగా ఒక్కో షేరుకి రూ. 442.19ను బ్యాంకు బోర్డు మంగళవారం ప్రకటించింది. ఇది మంగళవారం ముగింపు ధర రూ. 429తో పోలిస్తే 3 శాతం అధికం. ఈక్విటీ షేర్ల విక్రయం ద్వారా రూ. 15,000 కోట్లవరకూ సమీకరించేందుకు గత నెల 31న జరిగిన వార్షిక సమావేశంలోనే యాక్సిస్‌ బ్యాంకు బోర్డు ఆమోదముద్ర వేసింది. ఈ బాటలో మంగళవారం సమావేశమైన హోల్‌టైమ్‌ డైరెక్టర్ల కమిటీ క్విప్‌ ధరను నిర్ణయించింది. తద్వారా రూ. 8,000 కోట్ల సమీకరణకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇష్యూకి అధిక స్పందన లభిస్తే మరో రూ. 2,000 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కేటాయించనుంది. తద్వారా రూ. 10,000 కోట్లు సమకూర్చుకునే ప్రణాళికల్లో ఉంది. 

గతంలో
యాక్సిస్‌ బ్యాంక్‌ ఇంతక్రితం 2019 సెప్టెంబర్‌లో క్విప్‌ ద్వారా రూ. 12,500 కోట్లు సమీకరించింది. కాగా.. ఈ జూన్‌కల్లా బ్యాంక్‌ కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్‌) 17.29 శాతంగా నమోదైంది. తాజా నిధుల సమీకరణతో బ్యాంక్‌ టైర్‌-1 క్యాపిటల్‌ 1.5 శాతంమేర మెరుగుపడనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. బ్యాంక్‌ బోర్డు క్విప్‌, తదితర అంశాలపై తిరిగి ఈ నెల 10న నిర్వహించనున్న సమావేశంలో సమీక్షను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యాక్సిస్‌ బ్యాంక్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 3.6 శాతం ఎగసి రూ. 445 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 447 వరకూ జంప్‌ చేసింది. కోవిడ్‌-19 కారణంగా దేశ బ్యాంకింగ్‌ రంగంలో మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) సగటున 11.5 శాతంవరకూ ఎగసే వీలున్నట్లు రేటింగ్‌ దిగ్గజం క్రిసిల్‌ అంచనా వేసిన విషయం విదితమే. దీంతో బ్యాంకులు తాజా పెట్టుబడుల సమీకరణకు ఆసక్తి చూపుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. సగటున గతేడాది మొండిరుణాలు 8.3 శాతానికి చేరిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు