మ్యాక్స్‌ లైఫ్‌ వాటాపై యాక్సిస్‌ కన్ను

29 Aug, 2022 06:03 IST|Sakshi

6–9 నెలల్లో 20 శాతానికి పెరిగే చాన్స్‌

న్యూఢిల్లీ: బీమా సంస్థ మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లోగల వాటాను పెంచుకోనున్నట్లు ప్రయివేట్‌ రంగ దిగ్గజం యాక్సిస్‌ బ్యాంక్‌ తాజాగా వెల్లడించింది. రానున్న 6–9 నెలల్లో వాటాను 20 శాతంవరకూ పెంచుకునే వీలున్నట్లు బ్యాంక్‌ సీఈవో ప్రశాంత్‌ త్రిపాఠి ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ప్రస్తుతం అనుబంధ సంస్థలు రెండింటితో కలసి మ్యాక్స్‌ లైఫ్‌లో 12.99 శాతం వాటాను యాక్సిస్‌ బ్యాంక్‌ కలిగి ఉంది. గతేడాది ఏప్రిల్‌లో డీల్‌కు అనుమతిని పొందాక మ్యాక్స్‌ లైఫ్‌లో యాక్సిస్‌ ఈ వాటాను సొంతం చేసుకుంది.

ఒప్పందంలో భాగంగా మ్యాక్స్‌ లైఫ్‌లో 7 శాతంవరకూ అదనపు వాటా కొనుగోలుకు యాక్సిస్‌ అనుబంధ సంస్థలకు హక్కు లభించింది. నియంత్రణ సంస్థల అనుమతుల తదుపరి ఒకేసారి లేదా దఫదఫాలుగా వాటాను దక్కించుకోవచ్చు. గత ఐదేళ్లలో బ్యాంకెస్యూరెన్స్‌ విభాగం 18–20 శాతం వృద్ధిని సాధిస్తున్నట్లు త్రిపాఠి పేర్కొన్నారు. నూతన అమ్మకాలలో 60 శాతం ఈ విభాగం ద్వారానే నమోదవుతున్నట్లు తెలియజేశారు. బ్యాంక్, బీమా కంపెనీల మధ్య ఒప్పందమే బ్యాంకెస్యూరెన్స్‌. దీంతో బ్యాంక్‌ కస్టమర్లకు బీమా ప్రొడక్టులను విక్రయించడం, బ్యాంక్‌ బ్రాంచీలను ఇందుకు వినియోగించుకోవడానికి వీలుంటుంది.

మరిన్ని వార్తలు