Axis Short Term Fund: రిస్క్‌ తక్కువ.. నాణ్యత ఎక్కువ

13 Sep, 2021 08:31 IST|Sakshi

యాక్సిస్‌ షార్ట్‌టర్మ్‌ ఫండ్‌: వృద్ధికి మద్దతుగా నిలిచే లక్ష్యంతో ఆర్‌బీఐ ఎంపీసీ ఆగస్ట్‌ భేటీలో రెపో రేటులో ఎటువంటి మార్పులు చేయలేదు. అలాగే, సర్దుబాటు ధోరణినే కొనసాగించింది. లిక్విడిటీని సాధారణ స్థితికి తీసుకువచ్చే లక్ష్యంతో వేరియబుల్‌ రివర్స్‌ రెపో (వీఆర్‌ఆర్‌) మొత్తాన్ని పెంచింది. దీంతో భవిష్యత్తు వడ్డీ రేట్ల గమనంపై అనిశ్చితి కొనసాగనుంది. మోస్తరు రిస్క్‌ తీసుకుని, ఏడాది నుంచి మూడేళ్లపాటు ఇన్వెస్ట్‌ చేసుకునే వారు షార్ట్‌ డ్యురేషన్‌ (స్వల్ప కాల) ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ పథకాలు డెట్, మనీ మార్కెట్‌ సాధనాలైన కార్పొరేట్‌ బాండ్లు, డిబెంచరర్లు, సర్టిఫికెట్‌ ఆఫ్‌ డిపాజిట్స్‌ (సీడీలు), ట్రెజరీ బిల్లులు, ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేస్తుంటాయి. 1–3 ఏళ్ల కాలంతో కూడిన సాధనాలను ఎంపిక చేసుకుంటాయి. ఈ విభాగంలో యాక్సిస్‌ షార్ట్‌టర్మ్‌ ఫండ్‌ మంచి పనితీరును చూపిస్తోంది.  

పనితీరు.. 
ఈ పథకాల రాబడుల్లో అస్థిరతలను గమనించొచ్చు. కానీ, రాబడులు అధికంగా ఉంటాయి. యాక్సిస్‌ షార్ట్‌ టర్మ్‌ పనితీరును గమనిస్తే స్థిరంగా కనిపిస్తుంది. వ్యాల్యూరీసెర్చ్‌ 4స్టార్‌ రేటింగ్‌ ఇచ్చిన పథకం ఇది. ఏడాది కాలంలో 8.9 శాతం, మూడేళ్లలో 8.5 శాతం చొప్పున వార్షిక రాబడులను ఈ పథకం ఇచ్చింది. ఐదేళ్లలో 7.52 శాతం, ఏడేళ్లలో 8 శాతం, 10 ఏళ్లలో 8.24 శాతం చొప్పున వార్షిక రాబడులు ఈ పథకంలో కనిపిస్తాయి. ఎఫ్‌డీ రాబడుల కంటే ఇవి మెరుగైనవే. ఈ పథకం నిర్వహణలో రూ.12,183 కోట్ల పెట్టుబడులున్నాయి. రిస్క్‌ విషయంలో సగటు కంటే తక్కువ విభాగంలో ఈ పథకం ఉంది.

చదవండి: ప్రపంచ దేశాలకు భారత్‌ ఎగుమతులు, 75 రకాల ఉత్పత్తులు గుర్తింపు 

పోర్ట్‌ఫోలియో.. 
అధిక నాణ్యత, తక్కువ రిస్క్‌ అనే విధానాన్ని యాక్సిస్‌ షార్ట్‌ టర్మ్‌ ఫండ్‌ అనుసరిస్తుంది. ప్రస్తుతం ఏడాది కాలవ్యవధితో కూడిన కార్పొరేట్‌ బాండ్స్, మనీ మార్కెట్‌ సాధనాల్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టి ఉంది. అధిక రేటింగ్‌ కలిగిన దీర్ఘకాల కార్పొరేట్‌ బాండ్స్‌లోనూ కొంత పెట్టుబడులున్నాయి. పోర్ట్‌ఫోలియోలో ఉన్న స్వల్పకాల సాధనాలు.. సమీప కాలంలో వడ్డీ రేట్ల అస్థిరతలను అధిగమించేందుకు తోడ్పడతాయి.
 
ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చూస్తే.. దీర్ఘకాలంతో కూడిన సాధనాల నుంచి మెరుగైన రాబడులను ఆశించొచ్చు. 2021 జూలై నాటికి పథకం పోర్ట్‌ఫోలియోలోని సాధనాల సగటు మెచ్యూరిటీ 2.90 సంవత్సరాలుగా ఉంది. విడిగా పరిశీలిస్తే.. 27 శాతం పెట్టుబడులు ఏడాది వరకు కాల వ్యవధి కలిగిన సాధనాల్లోనూ.. 39 శాతం పెట్టుబడులు 1–3 ఏళ్ల సాధనాల్లోనూ ఉన్నాయి. 3–5 ఏళ్ల కాలవ్యవధి సాధనాల్లో 11 శాతం, అంతకుమించిన కాలవ్యవధి కలిగిన డెట్‌ ఇన్‌స్ట్రుమెంట్లలో 14 శాతం చొప్పున ఇన్వెస్ట్‌ చేసి ఉంది. పెట్టుబడులకు ఎంపిక చేసుకున్న సాధనాల నాణ్యతను పరిశీలించినట్టయితే.. ఏఏఏ రేటెడ్‌ పేపర్లలోనే 83 శాతం పెట్టుబడులను కలిగి ఉంది. ఏఏఏ అనేది అధిక నాణ్యతకు సూచిక. 9 శాతం పెట్టుబడులు ఏఏప్లస్‌ డెట్‌ పేపర్లలో ఉన్నాయి. 

మరిన్ని వార్తలు