విప్రో ఆజీమ్‌ ప్రేమ్‌జీ ఇటీవల షేర్లు కొనుగోలు చేసిన కంపెనీ ఏంటో తెలుసా?

17 Nov, 2021 08:37 IST|Sakshi

Wipro Azim Premji's investment in Tanla Platforms Ltd: సీపాస్‌ (కమ్యూనికేషన్స్‌ ప్లాట్‌ఫాం యాజ్‌ ఏ సర్వీస్‌) దిగ్గజం తాన్లా ప్లాట్‌ఫామ్స్‌లో తాజాగా ఐటీ దిగ్గజం విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ పెట్టుబడులు పెట్టారు. ప్రేమ్‌జీకి చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు సుమారు 20.6 లక్షల షేర్లను కొనుగోలు చేశాయి. ఇందుకోసం షేరు ఒక్కింటికి రూ. 1,200 వెచ్చించాయి. బన్యాన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ సంస్థ వీటిని విక్రయించింది. 

ప్రేమ్‌జీ పెట్టుబడులపై తాన్లా సీఈవో ఉదయ్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను తీర్చిదిద్దడంలోను, కార్పొరేట్‌ గవర్నెన్స్‌ ప్రమాణాల్లోను, దాతృత్వంలోను అజీం ప్రేమ్‌జీకి సాటిలేరని మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు. తాన్లా ప్లాట్‌ఫామ్స్‌ ఏటా సుమారు 800 బిలియన్ల పైగా సందేశాలను ప్రాసెస్‌ చేస్తోంది. దేశీయంగా ఏ2పి ఎస్‌ఎంఎస్‌ ట్రాఫిక్‌లో దాదాపు 70% భాగం తాన్లాకు చెందిన ట్రూబ్లాక్‌ ద్వారా ప్రాసెస్‌ అవుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ నికర లాభం 67% ఎగిసి రూ. 136 కోట్లుగా నమోదైంది.  మంగళవారం బీఎస్‌ఈలో తాన్లా షేరు 5% ఎగిసి రూ. 1,327 వద్ద క్లోజయ్యింది.


- హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో
 

మరిన్ని వార్తలు