బి–న్యూ మొబైల్స్‌ ‘సెంచరీ’!

6 Jul, 2021 06:46 IST|Sakshi

101 ఔట్‌లెట్ల స్థాయికి చేరుకున్న కంపెనీ

2022 డిసెంబరుకల్లా మరో 100 స్టోర్లు

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మల్టీ బ్రాండ్‌ మొబైల్స్‌ రిటైల్‌ చైన్‌ బి–న్యూ మొబైల్స్‌ 100 స్టోర్ల మైలురాయిని అధిగమించింది. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో సోమవారం రెండు ఔట్‌లెట్లను ప్రారంభించింది. తద్వారా సంస్థ కేంద్రాల సంఖ్య 101కి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 50 లక్షల పైచిలుకు కస్టమర్లతో విజయవంతంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్టు బి–న్యూ మొబైల్స్‌ సీఎండీ వై.డి.బాలాజీ చౌదరి ఈ సందర్భంగా  తెలిపారు. 2014లో విజ యవాడలో తొలి స్టోర్‌తో మొబైల్స్‌ విక్రయాల్లోకి అడుగుపెట్టామని చెప్పారు. ఏపీలో 82, తెలంగాణలో 19 ఔట్‌లెట్లను నిర్వహిస్తున్నామన్నారు.  

వచ్చే ఏడాదికల్లా రెండింతలు..
గత ఆర్థిక సంవత్సరంలో బి–న్యూ మొబైల్స్‌ రూ.700 కోట్ల టర్నోవర్‌ సాధించింది. 2021–22లో రూ.1,000 కోట్లు ఆశిస్తున్నామని కంపెనీ ఈడీ వై.సాయి నిఖిలేశ్‌ తెలిపారు. ‘2022 డిసెంబరు నాటికి ఏపీ, తెలంగాణలో మరో 100 స్టోర్లను ప్రారంభిస్తాం. ఇందుకు రూ.50 కోట్లు వెచ్చిస్తాం. ఒక్క హైదరాబాద్‌లోనే 25 ఔట్‌లెట్లను తెరుస్తాం. ప్రస్తుతం సంస్థలో 700 పైచిలుకు సిబ్బంది ఉన్నారు. అన్ని స్టోర్లలో విస్తృత శ్రేణి మొబైల్స్‌ అందుబాటులో ఉంచాం. ప్రత్యక్షంగా చూసుకునేందుకు వీలుగా ప్రతి కేంద్రంలో లైవ్‌ డిస్‌ప్లే ఏర్పాటు చేశాం. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న కస్టమర్లకు రెండు గంటల్లో మొబైల్‌ను చేరవేస్తున్నాం’ అని వివరించారు.
స్టోర్‌ను ప్రారంభిస్తున్న బాలాజీ చౌదరి, నిఖిలేశ్‌ తదితరులు

మరిన్ని వార్తలు