Baba Ramdev: దూకుడు, ఐపీవో సంకేతాలు

14 Jul, 2021 08:38 IST|Sakshi

రూ.30,000 కోట్ల టర్నోవర్‌కు పతంజలి

మరో రెండుమూడేళ్లలో రుణ రహితంగా పతంజలి 

కలిసొచ్చిన రుచిసోయా కొనుగోలు

పతంజలి ఆయుర్వేద్‌ ఐపీవోపై సంకేతం 

సాక్షి, న్యూఢిల్లీ: బాబా రామ్‌దేవ్‌ ఆధ్వర్యంలోని పతంజలి గ్రూపు 2020–21లో రూ.30,000 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది. ముఖ్యంగా రుచి సోయా రూపంలో రూ.16,318 కోట్ల ఆదాయం సమకూరడం కలిసొచ్చింది.. దివాలా పరిష్కారానికి వచ్చిన రుచిసోయా కంపెనీని గతేడాది పతంజలి దక్కించుకున్న విషయం తెలిసిందే. 3-4 ఏళ్లలో గ్రూపులోని కంపెనీల రుణాలను పూర్తిగా తీర్చేసి, రుణ రహితంగా మారాలనే లక్ష్యంతో ఉన్నట్టు బాబా రామ్‌దేవ్‌ మంగళవారం వర్చవల్‌గా నిర్వహించిన సమావేశంలో మీడియాకు వెల్లడించారు. రుచి సోయా ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీవో) రూపంలో వచ్చే నిధుల్లో అధిక మొత్తాన్ని రుణాల చెల్లింపునకు వినియోగించనున్నామని రామ్‌దేవ్‌ తెలిపారు. పతంజలి గ్రూపులోని ఎఫ్‌ఎంసీజీ వ్యాపారమైన పతంజలి ఆయుర్వేద్‌ లిస్టింగ్‌పై త్వరలోనే సమాచారం ఇస్తామంటూ ఐపీవోపై సంకేతం ఇచ్చారు. ఎంత మేర వ్యాపారాన్ని వేరు చేయాలి? పతంజలి ఆయుర్వేద్‌ను ఎప్పుడు లిస్ట్‌ చేయాలన్నది త్వరలోనే తెలియజేస్తామన్నారు. 

10-24 శాతం మధ్య వృద్ధి  
పతంజలి గూటికి చేరిన రుచిసోయా పనితీరుపై ఎదురైన ప్రశ్నకు.. ‘‘రుచి సోయా వ్యాపారంలో 24 శాతం పురోగతి ఉంది. పతంజలి టర్నోవర్‌ రూ.11,000 కోట్ల నుంచి 2020-21 లో రూ.14,000 కోట్లకు పెరిగింది. గ్రూపు కంపెనీల్లో 10-24 శాతం మధ్య వ్యాపార వృద్ధి నెలకొంది. త్వరలోనే పతంజలి గ్రూపు రూ.4,300 కోట్ల మేర రుచి సోయా ఎఫ్‌పీవో నిర్వహించనుంది. రుచి సోయాకు రూ.3,300 కోట్ల రుణ భారం ఉంది. ఎఫ్‌పీవో రూపంలో సమీకరించే నిధుల్లో 40 శాశాన్ని రుణాలను తీర్చేందుకు వినియోగిస్తాం’’ అని బాబా రామ్‌దేవ్‌ వివరించారు. గ్రూపు మొత్తం రుణ భారం ఎంతన్నది ఆయన వెల్లడించలేదు. కరోనా కారణంగా తమ వ్యాపారాలపై పెద్దగా ప్రభావం లేదన్నారు. పతంజలి పరివాహన్‌ పేరుతో తమకు సొంత రవాణా విభాగం ఉన్నట్టు చెప్పారు. 3-4 ఏళ్లలో గ్రూపు కంపెనీల రుణ భారాన్ని పూర్తిగా తీర్చివేసే ప్రణాళికలతో ఉన్నట్టు పతంజలి ఆయుర్వేద్‌ ఎండీ ఆచార్య బాలకృష్ణ సైతం తెలిపారు. 

రూ.10వేల కోట్ల పెట్టుబడులు 
పతంజలి గ్రూపు పెట్టుబడుల గురించి బాబా రామ్‌దేవ్‌ వివరిస్తూ.. రానున్న ఐదేళ్లలో రూ.5,000-10,000 కోట్ల మేర ఇన్వెస్ట్‌ చేయనున్నట్టు చెప్పారు.  
 

మరిన్ని వార్తలు