మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల ఆశలపై నీళ్లు.. బ్యాడ్ న్యూస్ చెప్పిన సత్య నాదెళ్ల

12 May, 2023 17:43 IST|Sakshi

మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు సీఈవో సత్య నాదెళ్ల. ఈ ఏడాది జీతాల పెంపు ఉండబోదని స్పష్టం చేశారు. ఈ మేరకు  ఉద్యోగులకు సమాచారం అందించారు. ఇప్పటికే వేలాది ఉద్యోగాలకు కోత పెట్టిన ఈ టెక్ దిగ్గజం ఇప్పుడు ఉద్యోగుల జీతాల పెంపునకు కోత పెట్టింది. 

ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వర్చువల్ గర్ల్‌ఫ్రెండ్‌.. నెలకు రూ. 41 కోట్ల సంపాదన!

ఓ వైపు లేఆఫ్స్ కొనసాగుతున్నప్పటికీ ఇటీవలి త్రైమాసికాల్లో మైక్రోసాఫ్ట్ మంచి లాభాలనే నమోదు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సారి జీతాల పెంపు కచ్చితంగా ఉంటుందని ఉద్యోగులు కొండంత ఆశతో ఉన్నారు. అయితే ఈ ఏడాది జీతాల పెంపు ఉండదని సీఈవో సత్య నాదెళ్ల తేల్చి చెప్పేశారు.

కోవిడ్ సంక్షోభంతో ఏర్పడిన ఆర్థిక అనిశ్చితి కారణంగా ఈ సంవత్సరం జీతాల పెంపు ఉండదని, ఈ అనిశ్చిత సమయాల్లో తమ వ్యాపారం, ఉద్యోగుల స్థిరత్వాన్ని నిర్ధారించుకోవాలని భావిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. జీతాల పెంపు లేనప్పటికీ బోనస్‌లు, స్టాక్ అవార్డుల ద్వారా ఉద్యోగులకు ప్రోత్సాహాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. తమ ఉద్యోగులకు వృద్ధి, ఎదుగుదలకు అవకాశాలను కల్పించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది.

ఆన్‌లైన్ విక్రయాలపై దృష్టి సారించినట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొన్న నేపథ్యంలో రిటైల్ స్టోర్‌లలోని వేలాది మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోందన్న వార్తలకు బలం చేకూరుతోంది. తొలగింపులు ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ ఉద్యోగులందరిపైనా ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు.

మైక్రోసాఫ్ట్ జీతాల పెంపును స్తంభింపజేయడం టెక్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లకు సంకేతం. ఇటీవలి కాలంలో లేఆఫ్స్, జీతాల పెంపు నిలిపివేత, వేతనాల తగ్గింపు వంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్న ఏకైక టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు. జనవరిలో ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా 3,200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్ కూడా నియామకాల వేగాన్ని తగ్గిస్తున్నట్లు తెలిపింది.

ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఆకతాయి పని.. అరెస్ట్ చేసిన పోలీసులు

మరిన్ని వార్తలు