Sahara Group: చిక్కుల్లో సహారా: సుప్రీంకోర్టులో భారీ షాక్‌!

27 May, 2022 11:40 IST|Sakshi

తొమ్మిది కంపెనీలపై విచారణ షురూ!

ఎస్‌ఎఫ్‌ఐఓ దర్యాప్తుపై  స్టే ఉత్తర్వు కొట్టివేత

సహారా చీఫ్, ఇతర అధికారులపై లుక్‌ అవుట్‌ చర్యలకూ మార్గం

న్యూఢిల్లీ: సహారా గ్రూప్, ఆ సంస్థ చీఫ్‌ సుబ్రతా రాయ్, ఇతర అధికారులకు సుప్రీంకోర్టులో గురువారం తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది.  సహారా గ్రూపునకు సంబంధించిన తొమ్మిది కంపెనీలపై సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐఓ) విచారణను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సహారా గ్రూప్‌ చీఫ్‌ సుబ్రతా రాయ్, ఇతర అధికారులపై లుక్‌అవుట్‌ సర్క్యులర్‌లతో సహా తదుపరి చర్యలు చేపట్టడానికి కూడా సుప్రీం రూలింగ్‌ వీలు కల్పిస్తోంది. దర్యాప్తుపై స్టే విధించడం ‘చాలా అసాధారణమైన ఉత్తర్వు‘ అని న్యాయమూర్తులు డీ వై చంద్రచూడ్,  బేల ఎం త్రివేదిలతో కూడిన వెకేషన్‌ బెంచ్‌ వ్యాఖ్యానించింది. హైకోర్టు ఆదేశాలపై ఎస్‌ఎఫ్‌ఐఓ గత ఏడాది డిసెంబర్‌ 13న దాఖలు చేసిన అప్పీల్‌ను అనుమతించింది.  

తొమ్మిది కంపెనీలూ ఇవీ... 
మూడు గ్రూప్‌ సంస్థలు-సహారా క్యూషాప్‌ యూనిక్‌ ప్రొడక్ట్స్‌ రేంజ్‌ లిమిటెడ్, క్యూ గోల్డ్‌ మార్ట్‌ లిమిటెడ్, సహారా హౌసింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ వ్యవహారాలపై విచారణకు కేంద్రం 2018 అక్టోబర్‌ 31న ఆదేశాలు ఇచ్చింది. మరో ఆరు కంపెనీలు–  ఆంబీ వ్యాలీ లిమిటెడ్, క్వింగ్‌ అంబి సిటీ డెవలపర్స్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్, సహారా ఇండియా కమర్షియల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్, సహారా ప్రైమ్‌ సిటీ లిమిటెడ్, సహారా ఇండియా ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్, సహారా ఇండియా రియల్‌ ఎస్టేట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లపైనా  విచారణకు కేంద్రం 2020 అక్టోబరు 27న ఆదేశాలు ఇచ్చింది. వీటిని ఢిల్లీ హైకోర్టులో సవాలు చూస్తూ  సహారా గ్రూప్‌ కేంద్రం ఉత్తర్వులపై స్టే తెచ్చుకుంది. 

రెండు నెలల్లో విచారణ పూర్తికి ఆదేశాలు... 
కాగా, సహారా గ్రూప్‌ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన రిట్‌ పిటిషన్లకు సంబంధించి ‘మెరిట్స్‌’ ప్రాతిపదికన తమ తాజా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై దాఖలు చేసిన రిట్‌ పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయన్న అంశాన్ని ప్రస్తావించింది. పెండింగ్‌లో ఉన్న రిట్‌ పిటిషన్‌లను త్వరిత గతిన పరిష్కరించాలని పేర్కొంది. వేసవి సెలవులు ముగిసి,  కోర్టును తిరిగి తెరిచిన తర్వాత రెండు నెలల్లోపు వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించాలని బెంచ్‌ ఢిల్లీ హైకోర్టుకు సూచించింది.   

మరిన్ని వార్తలు