క్యూ1లో బజాజ్‌ ఆటో స్పీడ్‌

23 Jul, 2021 00:42 IST|Sakshi

నికర లాభం రూ. 1,170 కోట్లు

మూడురెట్లు ఎగసిన ఎగుమతులు

న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం బజాజ్‌ ఆటో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి క్వార్టర్‌లో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన క్యూ1(ఏప్రిల్‌–జూన్‌)లో రూ. 1,170 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో నమోదైన రూ. 395.5 కోట్లతో పోలిస్తే నాలుగు రెట్లు అధికం. ఇందుకు ప్రధానంగా ఎగుమతులు కారణమైనట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది క్యూ1లో దేశవ్యాప్త లాక్‌డౌన్‌లు అమ్మకాలను దెబ్బతీసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది.

ఆదాయం జూమ్‌
క్యూ1లో బజాజ్‌ ఆటో మొత్తం ఆదాయం సైతం రూ. 3,079 కోట్ల నుంచి రూ. 7,386 కోట్లకు జంప్‌చేసింది. ప్రస్తుత త్రైమాసికంలోనూ కోవిడ్‌–19 సెకండ్‌ వేవ్‌ ప్రభావం చూపినప్పటికీ పలు దేశాలకు పెరిగిన ఎగుమతులు దన్నునిచ్చినట్లు కంపెనీ వివరించింది. క్యూ1లో వాహన అమ్మకాలు 4,43,103 యూనిట్ల నుంచి 10,06,014 యూనిట్లకు ఎగసినట్లు తెలియజేసింది. వీటిలో ఎగుమతులు మూడు రెట్లు ఎగసి 6,48,877 యూనిట్లకు చేరగా.. దేశీయంగా 3,57,137 వాహనాలు విక్రయమయ్యాయి. జూన్‌ చివరికల్లా మిగులు నగదు, తత్సమాన నిల్వల విలువ రూ. 19,097 కోట్లను తాకినట్లు కంపెనీ వెల్లడించింది. మొబిలిటీ విభాగంలో ద్విచక్ర, త్రిచక్ర ఎలక్ట్రిక్, హైబ్రిడ్‌ వాహనాల తయారీ కోసం పూర్తి అనుబంధ సంస్థను ఏర్పాటు చేసేందుకు బోర్డు అనుమతించినట్లు బజాజ్‌ ఆటో తెలియజేసింది.

ఫలితాల నేపథ్యంలో బజాజ్‌ ఆటో షేరు 1.2% నీరసించి రూ. 3,860 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు