సెప్టెంబర్‌లో ఆటోరంగం అమ్మకాల స్పీడ్‌

1 Oct, 2020 14:28 IST|Sakshi

గత నెలలో వాహన విక్రయాలు 10 శాతం అప్‌

8 శాతం దూసుకెళ్లిన బజాజ్‌ ఆటో షేరు

మారుతీ, ఎంఅండ్‌ఎం, ఎస్కార్ట్స్‌ అమ్మకాలు జూమ్‌

ద్విచక్ర వాహన అమ్మకాలపై అంచనాలతో టీవీఎస్‌ జోరు

కోవిడ్‌-19 కట్టడికి విధించిన లాక్‌డవున్‌ల ఎత్తివేత నేపథ్యంలో వాహన పరిశ్రమ నెమ్మదిగా పుంజుకుంటోంది. ఈ బాటలో ఇప్పటికే ట్రాక్టర్ల విక్రయాలు ఊపందుకోగా.. గత నెల(సెప్టెంబర్‌)లో ద్విచక్ర వాహన అమ్మకాలు జోరందుకున్నాయి. అంతేకాకుండా కార్ల విక్రయాలు సైతం వేగమందుకున్నాయి. ఇకపై ఆటో రంగం మరింత బలపడనున్న అంచనాలు వాహన తయారీ కంపెనీలకు డిమాండ్‌ను పెంచుతున్నట్లు మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. ఇతర వివరాలు చూద్దాం..

బజాజ్‌ ఆటో జూమ్‌
గత నెలలో బజాజ్‌ ఆటో వాహన విక్రయాలు అంచనాలను మించడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్లో కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. దీంతో ఎన్‌ఎస్‌ఈలో బజాజ్‌ ఆటో షేరు 5.3 శాతం జంప్‌చేసి రూ. 3,033 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 8 శాతం దూసుకెళ్లింది. రూ. 3,114 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఈ బాటలో ద్విచక్ర వాహన దిగ్గజం టీవీఎస్‌ మోటార్‌ సైతం మెరుగైన అమ్మకాలను సాధించగలదన్న అంచనాలు ఈ కౌంటర్‌కు సైతం డిమాండ్‌ను పెంచాయి. వెరసి ఎన్‌ఎస్‌ఈలో తొలుత టీవీఎస్‌ మోటార్‌ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 490ను తాకింది. ప్రస్తుతం 3.6 శాతం లాభంతో రూ. 485 వద్ద ట్రేడవుతోంది.

అమ్మకాలు భళా
సెప్టెంబర్‌లో బజాజ్‌ ఆటో మొత్తం 4.41 లక్షల వాహనాలను విక్రయించింది. ఇది 10 శాతం వృద్ధికాగా.. ద్విచక్ర వాహన అమ్మకాలు 20 శాతం పెరిగి దాదాపు 4.09 లక్షలకు చేరాయి. వీటిలో ద్విచక్ర వాహన ఎగుమతులు 16 శాతం ఎగసి 1.85 లక్షల యూనిట్లను దాటాయి. కాగా.. కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ మొత్తం అమ్మకాలు గత నెలలో 31 శాతం జంప్‌చేసి 1.6 లక్షల యూనిట్లను అధిగమించగా.. ఎస్కార్ట్స్‌ లిమిటెడ్‌ ట్రాక్టర్ల విక్రయాలు 9 శాతం బలపడి 11,851 యూనిట్లను తాకాయి. ఇదే ఇధంగా ఎంఅండ్‌ఎం సైతం 17 శాతం అధికంగా 43,386 ట్రాక్టర్ల అమ్మకాలను సాధించింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు