డామినర్ 400 పై భారీ డిస్కౌంట్.. బజాజ్ ప్రేమికులకు పండగే

23 Feb, 2023 17:01 IST|Sakshi

భారత ప్రభుత్వం 2023 ఏప్రిల్ నుంచి బిఎస్6 2 ఉద్గార నిబంధలను మరింత కఠినంగా అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇదే సమయంలో వాహన తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను విక్రయించడానికి, కస్టమర్లను ఆకర్షించడానికి భారీ డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి.

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'బజాజ్ డామినర్ 400' మీద కంపెనీ ఇప్పుడు రూ. 25,000 డిస్కౌంట్ ప్రకటించింది. ఇప్పటికే ఉన్న బిఎస్6 స్టాక్ క్లియర్ చేయడానికి కంపెనీ ఈ ఆకర్షణీయమైన ఆఫర్ తీసుకువచ్చింది. దీనితో పాటు తక్కువ డౌన్ పేమెంట్ స్కీమ్‌ కూడా అందుబాటులో ఉంది.

బజాజ్ కంపెనీ అందిస్తున్న ఈ డిస్కౌంట్ వల్ల డామినార్ 400 రూ. 1,99,991 (ఎక్స్-షోరూమ్) వద్ద లభిస్తుంది. బిఎస్6 స్టాక్ క్లియర్ చేయడమే కాకుండా కంపెనీ యొక్క అమ్మకాలను పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. బజాజ్ డామినర్ 400 రూ. 1.36 లక్షల వద్ద 2016లో విడుదలైంది.

బజాజ్ డామినార్ 400 మోటార్‌సైకిల్ 373 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్, డిఓహెచ్సి ఇంజన్ కలిగి 39.4 బిహెచ్‌పి పవర్, 35 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. అదే సమయంలో ఈ బైక్ 43 మిమీ యుఎస్‌డి ఫోర్క్స్, 110 మిమీ ట్రావెల్‌తో మోనోశాక్ పొందుతుంది.

బజాజ్ డామినార్ 400 బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందువైపు 320 మిమీ డిస్క్ బ్రేక్స్, వెనుక వైపు 230 మిమీ డిస్క్ బ్రేక్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో మెరుగైన బ్రేకింగ్ కోసం డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ కూడా సఫోర్ట్ చేస్తుంది.

మరిన్ని వార్తలు