బజాజ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అమ్మకాలు హైదరాబాద్‌లో షురూ !

22 Sep, 2021 11:11 IST|Sakshi

పెరుగుతున్న పెట్రోలు ధరల నుంచి ఉపశమనం కలిగించేలా హమారా బజాజ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ని మార్కెట్‌లోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా ఒక్కో నగరంలో అమ్మకాలు ప్రారంభిస్తూ వస్తోన్న బజాజ్‌ సంస్థ.. తాజాగా హైదరాబాద్‌లో అమ్మకాలు మొదలుపెట్టింది. 

ఆన్‌లైన్‌ బుకింగ్‌
బజాజ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను సొంతం చేసుకోవాలంటే ముందుగా ఆన్‌లైన్‌ రూ.2000 చెల్లించి బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. చేతక్‌ డాట్‌కామ్‌ వెబ్‌సైట్‌కి వెళ్లి అక్కడ అవసరమైన వివరాలు పొందు పరిచి నచ్చిన స్కూటర్‌ని ఎంపిక చేసుకోవచ్చు. ప్రీ బుకింగ్‌ని రద్దు చేసుకుంటే వెయ్యి రూపాయలు రీఫండ్‌ వస్తుంది.

నాలుగో రాష్ట్రం
బజాజ్‌ సంస్థ తన ఎలక్ట్రిక్‌ స్కూటర్ల అమ్మకాలను తొలుత తమిళనాడుతో మొదలుపెట్టి కర్నాటక, మహారాష్ట్ర మీదుగా ప్రస్తుతం తెలంగాణాలో అమ్మకాలు ప్రారంభించింది. మిగిలిన కంపెనీల తరహాలో కాకుండా ఒక్కో రాష్ట్రంలో ఒక్కో నగరంలో తమ ఎలక్ట్రిక్‌ స్కూటర్లను అందుబాటులోకి తెస్తోంది. 

మూడు చోట్ల
ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో కూకట్‌పల్లి, బేగంపేట, కాచిగూడలలో ఉన్న బజాజ్‌ చేతక్‌ షోరూమ్‌లలో ఈ స్కూటర్లను అందుబాటులో ఉంచింది. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రర్‌ చేసుకున్న వారి ఈ షోరూమ్‌లకు వెళ్లి స్కూటర్‌ డెలివరీని తీసుకోవాల్సి ఉంటుంది.

రెండు వేరియంట్లు
బజాజ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌కి సంబంధించి ప్రీమియం, ఆర్బన్‌ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రీమియం నాలుగు రంగుల్లో లభిస్తుండగా అర్బన్‌ రెండు రంగుల్లో లభిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రీమియం వేరియంట్‌ ఒక్కటే అమ్మకానికి సిద్ధంగా ఉంది.

ధర ఎంతంటే
బజాజ్‌ చేతక్‌ ప్రీమియం హైదరాబాద్‌ ఎక్స్‌షోరూం ధర రూ.1,50,461 ఉండగా ఆన్‌రోడ్‌ ధర రూ. 1,89,175లుగా ఉంది. బజాజ్‌ అర్బన్‌ ఎక్స్‌షోరూం ధర రూ. 1,00,000గా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌కి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను మాఫీ చేసింది.

ఫీచర్లు
ఫుల్‌గా ఛార్జ్‌ చేసిన బ్యాటరీతో ఎకానమీ మోడ్‌లో 90 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. బ్యాటరీ ఫుల్‌ ఛార్జ్‌ చేసేందుకు 5 గంటల సమయం పడుతుంది. క్విక్‌ ఛార్జింగ్‌ ఆప్షన్‌లో గంట సేపు ఛార్జ్‌ చేస్తే 25 శాతం బ్యాటరీ ఛార్జ్‌ అవుతుంది. దీంతో కనీసం 20 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చు.

వారంటీ
మూడేళ్లు లేదా 50,000 కిలోమీటర్ల ప్రయాణం వరకు స్కూటర్‌, లిథియం ఐయాన్‌ బ్యాటరీపై బజాజ్‌ సంస్థ వారంటీ అందిస్తోంది. టైర్లపై వన్‌ ఇయర్‌ వారంటీ ఇస్తోంది. ఈ స్కూటర్‌కి డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా బజాజ్‌ పేర్కొంది. దీనికి సంబంధించి ఐపీఎస్‌ 67 సర్టిఫికేట్‌ ఉన్నట్టు చెబుతోంది. స్కూటర్‌ కొనే ఆసక్తి ఉన్న వారు చేతక్‌ డాట్‌కామ్‌ వెబ్‌సైట్‌లో టెస్ట్‌ రైట్‌ స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. 
చదవండి: బజాజ్ పల్సర్ 150 కంటే ఖరీదైనదిగా పల్సర్ ఎన్ఎస్ 125 బైక్

మరిన్ని వార్తలు