బంధన్‌ బ్యాంక్‌- క్యాడిలా హెల్త్‌ జోరు

8 Oct, 2020 12:21 IST|Sakshi

క్యూ2లో 20 శాతం రుణ వృద్ధి

4 శాతం జంప్‌చేసిన బంధన్‌ బ్యాంక్‌

ఊపిరితిత్తుల ఉపశమన ఇన్‌హేలర్‌ విడుదల

52 వారాల గరిష్టానికి క్యాడిలా హెల్త్‌కేర్‌ షేరు

వరుసగా ఐదో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాల దౌడు తీస్తున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే ప్రామాణిక ఇండెక్స్‌ సెన్సెక్స్‌ లాభాల ట్రిపుల్‌ చేయడం ద్వారా 40,000 పాయింట్ల మైలురాయిని అధిగమించింది. కాగా.. ఊపరితిత్తులకు ఎదురయ్యే సమస్యల నుంచి ఉపశమనాన్ని కల్పించే ఔషధాన్ని దేశీ మార్కెట్లో విడుదల చేసినట్లు వెల్లడించడంతో క్యాడిలా హల్త్‌కేర్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. మరోపక్క ఈ ఏడాది(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర  బిజినెస్‌ను సాధించిన వార్తలతో బంధన్‌ బ్యాంక్‌ కౌంటర్‌ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

క్యాడిలా హెల్త్‌కేర్
ప్రెజరైజ్డ్‌ మీటర్డ్‌ డోస్‌ ఇన్‌హేలర్‌(పీఎండీఐ)ను దేశీయంగా తొలిసారి విడుదల చేసినట్లు ఫార్మా రంగ కంపెనీ క్యాడిలా హెల్త్‌కేర్‌ తాజాగా పేర్కొంది. ఊపిరి తీయడంలో ఎదురయ్యే సమస్యల నుంచి ఈ ఔషధం ఉపశమనాన్ని కల్పిస్తుందని కంపెనీ తెలియజేసింది. ఎల్‌ఏఎంఏ, ఎల్‌ఏబీఏలతో కూడిన ఈ ఇన్‌హేలర్‌ సీవోపీడీ రోగుల చికిత్సలో వినియోగించవచ్చని వివరించింది. ఫార్‌గ్లిన్‌ పీఎండీఐగా పిలిచే ఈ ప్యాక్‌ విలువ రూ. 495గా తెలియజేసింది. ఈ నేపథ్యంలో క్యాడిలా హెల్త్‌కేర్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 4.4 శాతం జంప్‌చేసి రూ. 431 వద్ద ట్రేడవుతోంది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. గత నెల రోజుల్లో ఈ షేరు 17 శాతం పుంజుకుంది!

బంధన్‌ బ్యాంక్‌
ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న ప్రయివేట్‌ రంగ సంస్థ బంధన్‌ బ్యాంక్‌ కౌంటర్‌ మరోసారి వెలుగులో నిలుస్తోంది. క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో బ్యాంక్‌ రుణ వృద్ధి 20 శాతం పుంజుకోవడం దీనికి కారణంకాగా.. వసూళ్లు నిష్పత్తి 92 శాతంగా నమోదైనట్లు బ్యాంక్‌ తెలియజేసింది. డిపాజిట్లలోనూ 34 శాతం వృద్ధిని సాధించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో బంధన్‌ బ్యాంక్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 2.3 శాతం ఎగసి రూ. 322 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 327ను అధిగమించింది. గత వారం రోజుల్లో ఈ షేరు 14 శాతం లాభపడటం గమనార్హం!

మరిన్ని వార్తలు