బంధన్‌ బ్యాంక్‌కు వాటా విక్రయ షాక్‌

3 Aug, 2020 11:37 IST|Sakshi

21 శాతం వాటా విక్రయించిన ప్రమోటర్లు

ఆర్‌బీఐ నిబంధనలమేరకే వాటా తగ్గింపు

11 శాతం కుప్పకూలిన షేరు 

60.95 శాతం నుంచి 40 శాతానికి ప్రమోటర్ల వాటా!

ప్రయివేట్ రంగ సంస్థ బంధన్‌ బ్యాంక్‌ కౌంటర్లో ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో ఎన్ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 11.3 శాతం కుప్పకూలి రూ. 306 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 295 వరకూ జారింది. రిజర్వ్‌ బ్యాంక్‌ నిబంధనల ప్రకారం బంధన్‌ బ్యాంకులో ప్రమోటర్లు 20 శాతం వాటా విక్రయించే సన్నాహాల్లో ఉన్నట్లు బ్యాంకింగ్‌ వర్గాలు వారాంతాన పేర్కొన్నాయి. బ్లాక్‌డీల్‌ ద్వారా 20.9 శాతం వాటాను నేటి ట్రేడింగ్‌లో విక్రయానికి ఉంచినట్లు తెలుస్తోంది. బ్లాక్‌డీల్‌ విలువ రూ. 10,500 కోట్లుకాగా.. ఇందుకు ఫ్లోర్‌ ధర రూ. 311.10గా నిర్ణయించినట్లు సంబంధితవర్గాలు తెలియజేశాయి. ఇది శుక్రవారం ముగింపు రూ. 345తో పోలిస్తే 10 శాతం డిస్కౌంట్‌కావడం  గమనార్హం! 

భారీ ట్రేడింగ్‌
బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల ద్వారా రూ. 314 సగటు ధరలో బంధన్‌ బ్యాంక్‌కు చెందిన 33 కోట్ల షేర్లు తొలుత బ్లాక్‌డీల్స్‌ ద్వారా చేతులు మారినట్లు మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ఇవి బ్యాంకు ఈక్విటీలో 20.6 శాతం వాటాకు సమానమని తెలియజేశారు. వెరసి ట్రేడింగ్‌ ప్రారంభమైన 60 నిముషాల్లోనే బంధన్‌ బ్యాంక్‌ కౌంటర్లో 37 కోట్ల షేర్లు ట్రేడైనట్లు తెలుస్తోంది. ఈ కౌంటర్లో గత రెండు వారాల సగటు ట్రేడింగ్ పరిమాణం 7.47 లక్షల షేర్లు మాత్రమే!

కారణమేవిటంటే?
ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ప్రమోటర్లు మూడేళ్లలోగా బ్యాంకులో తమ వాటాను 40 శాతానికి పరిమితం చేసుకోవలసి ఉంటుంది. జూన్‌ చివరికల్లా బంధన్‌ బ్యాంకులో ప్రమోటర్లు 60.95 శాతం వాటాను కలిగి ఉన్నారు. కొత్త బ్యాంకింగ్‌ లైన్సింగ్‌ విధానాల రీత్యా బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభమైన మూడేళ్లలోగా ప్రమోటర్ల వాటా 40 శాతానికి కుదించుకోవలసి ఉంటుందని నిపుణులు వివరించారు. దీంతో బంధన్‌ బ్యాంక్‌ ప్రమోటర్లు వాటా విక్రయం కోసం క్రెడిట్‌ స్వీస్‌ సెక్యూరిటీస్‌, జేపీ మోర్గాన్‌ ఇండియా, గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఇండియా సెక్యూరిటీస్‌ తదితరాలను బుక్‌రన్నర్స్‌గా ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు