తలసరి ఆదాయంలో భారత్‌ను మించనున్న బంగ్లా!

15 Oct, 2020 05:37 IST|Sakshi

2020పై ఐఎంఎఫ్‌ అంచనాలు

న్యూఢిల్లీ: తలసరి ఆదాయం విషయంలో 2020లో భారత్‌ను పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌ మించిపోయే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనావేస్తోంది. ఒక దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువను  ఆ దేశ జనాభాతో భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయం. ఐఎంఎఫ్‌ ‘‘వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌’’ నివేదిక ప్రకారం, 2021 మార్చి 31వ తేదీతో ముగిసే ఆర్థిక సంవత్సరంలో భారత్‌ తలసరి ఆదాయం 1,877 డాలర్లుగా (డాలర్‌ మారకంలో రూపాయి విలువ 70 ప్రకారం చూస్తే, రూ.1,31,390)నమోదుకానుంది. ఇక ఇదే కాలంలో బంగ్లాదేశ్‌ తలసరి ఆదాయం 1,888 డాలర్లకు పెరగనుంది. కరోనా సవాళ్ల నేపథ్యంలో భారత్‌ ఆర్థిక వ్యవస్థ 2020లో 10.3% క్షీణిస్తుందని ఐఎంఎఫ్‌ ఇదే నివేదికలో అంచనావేసింది.  

కొనుగోలు శక్తి ప్రమాణాల్లో భారత్‌దే పైచేయి!
ఐఎంఎఫ్‌ అంచనాల ప్రభావాన్ని తగ్గించే గణాంకాలను అధికార వర్గాలు ప్రస్తావిస్తుండడం ఇక్కడ మరో అంశం. దేశాల ఉత్పాదకత, కరెన్సీల కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలకు సంబంధించిన పర్చేజింగ్‌ పవర్‌ ప్యారిటీ (పీపీపీ) విధానం ప్రకారం చూస్తే,  భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2019లో బంగ్లాదేశ్‌కన్నా 11 రెట్లు అధికమని అధికార వర్గాలు బుధవారం పేర్కొన్నాయి. తలసరి ఆదాయంలో భారత్‌ను బంగ్లాదేశ్‌ అధిగమించనున్నదన్న ఐఎంఎఫ్‌ అంచనాలను ప్రస్తావిస్తూ, ‘‘ఆరు సంవత్సరాల్లో బీజేపీ పాలన సాధించిన ఘనత ఇదీ’ అని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ చేసిన ఒక ట్వీట్‌ నేపథ్యంలో అధికార వర్గాలు తాజా వివరణ ఇచ్చాయి. 2014– 15లో రూ.83,091గా ఉన్న భారత్‌ తలసరి ఆదా యం 2019–20లో రూ.1,08,620కి చేరిందని అధి కార వర్గాలు వివరించారు. పీపీపీ విధానం ప్రకారం, 2020లో  భారత్‌ తలసరి ఆదాయం 6,284 డాలర్లు ఉంటుందని అంచనావేసిన ఐఎంఎఫ్, బంగ్లాదేశ్‌ విషయంలో దీన్ని 5,139 డాలర్లుగానే లెక్కగట్టడాన్ని అధికారులు ప్రస్తావించారు.

జీడీపీలో 90 శాతానికి కేంద్ర రుణ భారం
వాషింగ్టన్‌: కరోనా నేపథ్యంలో గవర్నమెంట్‌ బాండ్లు, ట్రెజరీ బిల్లులు, స్వల్పకాలిక రుణాలకు సంబంధించిన కేంద్ర రుణ భారం(పబ్లిక్‌ డెట్‌) భారీగా పెరిగే అవకాశం ఉందని ఐఎంఎఫ్‌ అంచనావేస్తోంది. 1991 నుంచీ జీడీపీలో పబ్లిక్‌ డెట్‌ స్థిరంగా దాదాపు 70% వద్ద కొనసాగుతుండగా, తాజా పరిస్థితుల్లో ఇది దాదాపు 90 వరకూ పెరిగే అవకాశం ఉందని ఐఎంఎఫ్‌ ఫైనాన్షియల్‌ వ్యవహారాల డైరెక్టర్‌ విక్టర్‌ గ్యాస్‌పర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు