బ్యాంకింగ్‌ బాదుడు.. రెడీగా ఉండండి, ఈ భారం కస్టమర్లదే!

11 Dec, 2022 15:53 IST|Sakshi

రెపోరేట్ల పెంపుతో బ్యాంకులు ఖాతాదారులకు ఇచ్చే రుణాలపై వడ్డీరేట్లు పెంచుతున్నాయి. ఇప్పటికే ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ, ప్రభుత్వ రంగం బ్యాంక్‌ ‘బ్యాంక్ ఆఫ్ ఇండియా’ రుణ రేట్లను పెంచాయి. అయితే తాజాగా మరో ప్రభుత్వ బ్యాంకింగ్‌ రంగ సంస్థ ‘బ్యాంక్ ఆఫ్ బరోడా’(బీవోబీ) ఎంసీఎల్ఆర్ రేటును 30 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. 

నవంబర్ నెలలో బీవోబీ ఎంసీఎల్ఆర్ రేటును పెంచింది. అప్పుడు రేట్ల పెంపు 15 బేసిస్ పాయింట్లుగా ఉంది. ఈ రుణ రేటు పెంపు నిర్ణయం డిసెంబర్ 12 నుంచి అమల్లోకి రానుంది. బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటు పెరగడం వల్ల హౌసింగ్, పర్సనల్ లోన్, వెహికల్ లోన్, ఎంఎస్ఈ (Small Medium Enterprises) లోన్స్ వంటివి భారం కానున్నాయి. ఇప్పటికే లోన్ తీసుకున్న వారు రీసెట్ డేట్ నుంచి అధిక వడ్డీ చెల్లించుకోవాల్సి వస్తుంది. దీంతో బ్యాంకులకు కట్టే నెలవారీ ఈఎంఐ పెరుగుతుంది.

బీవోబీలో ఎంసీఎల్‌ రేట్లు 
ఇక బీవోబీ ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో వడ్డీ రేటు 8.3 శాతానికి చేరింది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేటు 7.75 శాతం నుంచి 8.05 శాతానికి చేరింది. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 7.25 శాతం నుంచి 7.5 శాతానికి ఎగసింది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7.9 శాతం నుంచి 8.15 శాతానికి పెరిగింది.

మరిన్ని వార్తలు