బీవోబీ ఏటీఎంలో యూపీఐతో విత్‌డ్రాయల్‌

9 Jun, 2023 04:49 IST|Sakshi

మొబైల్‌ ఫోన్‌ ఉంటే చాలు

న్యూఢిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) తన కస్టమర్లకు మరో కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటరాపరేబుల్‌ క్యాష్‌ విత్‌డ్రాయల్‌ (ఐసీసీడబ్ల్యూ) సదుపాయం కింద.. యూపీఐ సాయంతో ఏటీఎంల నుంచి నగదును ఉపసంహరించుకోవచ్చని (విత్‌డ్రాయల్‌) ప్రకటించింది. ఈ సేవలు ప్రారంభించిన మొదటి ప్రభుత్వరంగ బ్యాంక్‌గా బీవోబీ నిలిచిపోనుంది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కస్టమర్లతో పాటు, ఇతర భాగస్వామ్య బ్యాంకుల కస్టమర్లు.. భీమ్‌ యూపీఐ, బీవోబీ వరల్డ్‌ యూపీఐ లేదా మరేదైనా యూపీఐ ఆధారంగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఏటీఎం నుంచి డబ్బులు (డెబిట్‌ కార్డు అవసరం లేకుండా) తీసుకోవచ్చని తెలిపింది.

కస్టమర్లు ఏటీఎం యంత్రంలో యూపీఐ క్యాష్‌ విత్‌డ్రాయల్‌ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. తర్వాత ఎంత మొత్తం తీసుకోవాలో నమోదు చేయాలి. ఆ తర్వాత ఏటీఎం స్క్రీన్‌పై క్యూఆర్‌ కోడ్‌ కనిపిస్తుంది. కస్టమర్‌ తన ఫోన్‌లోని యూపీఐ యాప్‌ తెరిచి ఏటీఎం స్క్రీన్‌పై కనిపించే క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి. తర్వాత యూపీఐ పిన్‌ను మొబైల్‌ యాప్‌లో నమోదు చేయాలి. దీంతో లావాదేవీ ప్రాసెస్‌ అయ్యి నగదు బయటకు వస్తుంది. ఒకటికి మించిన బ్యాంకు ఖాతాలకు యూపీఐ ఉంటే, అప్పుడు విడిగా ఏదన్నది ఎంపికకు అవకాశం ఉంటుంది. ఒక్క లావాదేవీలో రూ.5,000 చొప్పున, రోజులో రెండు లావాదేవీలనే ఈ రూపంలో అనుమతిస్తారు.

మరిన్ని వార్తలు