బీవోబీ లాభం ఆకర్షణీయం

1 Feb, 2024 05:22 IST|Sakshi

నికర లాభంలో 19 శాతం వృద్ధి

13.6 శాతం పెరిగిన రుణ పుస్తకం

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికి రూ.4,579 కోట్ల స్టాండలోన్‌ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.3,853 కోట్ల కంటే ఇది 19 శాతం ఎక్కువ. మొత్తం ఆదాయం రూ.27,092 కోట్ల నుంచి రూ.31,416 కోట్లకు వృద్ధి చెందింది. కన్సాలిడేటెడ్‌ లాభం రూ.4,306 కోట్ల నుంచి రూ.4,789 కోట్లకు చేరింది.

వడ్డీ ఆదాయం రూ.23,540 కోట్ల నుంచి రూ.28,605 కోట్లకు దూసుకుపోయింది. నికర వడ్డీ ఆదాయం కేవలం 2.6 శాతం పెరిగి రూ.11,101 కోట్లుగా నమోదైంది. డిపాజిట్లపై వ్యయాలు 4.01 శాతం నుంచి 4.96 శాతానికి పెరిగాయి. బ్యాంక్‌ రుణ ఆస్తుల నాణ్యత మరింత బలపడింది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) 3.08 శాతానికి (రూ.32,318 కోట్లు) తగ్గాయి.

క్రితం ఏడాది ఇదే త్రైమాసికానికి ఇవి 4.53 శాతంగా ఉంటే, 2023 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 3.32 శాతంగా ఉన్నాయి. నికర ఎన్‌పీఏలు 0.70 శాతానికి పరిమితమయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 0.99 శాతంగా ఉంటే, 2023 సెపె్టంబర్‌ చివరికి 0.76 శాతంగా ఉన్నాయి.

బ్యాంక్‌ అడ్వాన్స్‌లు (రుణాలు) 13.6 శాతం పెరిగి రూ.10,49,327 కోట్లకు చేరాయి. డిపాజిట్లు 8.3 శాతం వృద్ధితో రూ.12,45,300 కోట్లుగా ఉన్నాయి. రిటైల్‌ రుణాల్లో 22 శాతం వృద్ధి కనిపించింది. వ్యవసాయ రుణాలు 12.6 శాతం, బంగారం రుణాలు 28 శాతం పెరిగి రూ.45,074 కోట్లకు చేరాయి. ఆర్‌బీఐ నిబంధనల నేపథ్యంలో ఆల్టర్నేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఏఐఎఫ్‌)లో ఎక్స్‌పోజర్‌కు సంబంధించి రూ.50 కోట్లను పక్కన పెట్టింది.

ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేరు 5 శాతం ఎగసి రూ.248 వద్ద క్లోజ్‌ అయింది.
 

whatsapp channel

మరిన్ని వార్తలు