బీవోబీ లాభం రెట్టింపు

7 Feb, 2022 05:59 IST|Sakshi

క్యూ3లో రూ. 2,197 కోట్లు

ముంబై: పీఎస్‌యూ దిగ్గజం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో స్టాండెలోన్‌ నికర లాభం రెట్టింపై రూ. 2,197 కోట్లను తాకింది. గతేడాది(2020–21) క్యూ3లో రూ. 1,061 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఇందుకు వడ్డీ ఆదాయం పెరగడం, ప్రొవిజన్లు తగ్గడం దోహదపడింది. తాజా సమీక్షా కాలంలో నికర వడ్డీ ఆదాయం 14 శాతం ఎగసి రూ. 8,552 కోట్లకు చేరింది. ఫీజు ఆదాయం 15 శాతంపైగా పుంజుకుని రూ. 1,557 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 2.77 శాతం నుంచి 3.13 శాతానికి బలపడ్డాయి.

ఎన్‌పీఏలకు చెక్‌
ఈ ఏడాది క్యూ3లో స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 8.48 శాతం నుంచి 7.25 శాతానికి ఉపశమించాయి. నికర ఎన్‌పీఏలు సైతం 2.39 శాతం నుంచి 2.25 శాతానికి వెనకడుగు వేశాయి. తాజా స్లిప్పేజీలు రూ. 2,830 కోట్లుకాగా.. రికవరీలు రూ. 20,32 కోట్లు, అప్‌గ్రెడేషన్లు రూ. 1,272 కోట్లకు చేరాయి. మొత్తం ప్రొవిజన్లు రూ. 3,450 కోట్ల నుంచి రూ. 2,506 కోట్లకు తగ్గాయి. కనీస మూలధన నిష్పత్తి 15.47 శాతంగా నమోదైంది. నికర వడ్డీ ఆదాయం, మార్జిన్లు, ఫీజు ఆదాయంలో నమోదైన వృద్ధిని ఇకపైనా కొనసాగించే వీలున్నట్లు బీవోబీ ఎండీ, సీఈవో సంజీవ్‌ చద్దా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు