బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా లాభం 24% అప్‌

11 Nov, 2021 06:07 IST|Sakshi

క్యూ2లో రూ. 2,088 కోట్లు

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 2,088 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో నమోదైన రూ. 1,679 కోట్ల లాభంతో పోలిస్తే ఇది సుమారు 24 శాతం అధికం. రైటాఫ్‌ చేసిన ఖాతాల నుంచి అధిక మొత్తం రికవర్‌ కావడం, మార్జిన్లు స్థిర స్థాయిలో కొనసాగడం తదితర అంశాలు లాభాలు మెరుగుపడటానికి దోహదపడినట్లు బ్యాంక్‌ ఎండీ సంజీవ్‌ చడ్ఢా తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి 7–10 శాతం స్థాయిలో ఉండవచ్చని, కార్పొరేట్‌ రుణాలు కూడా వృద్ధి చెందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

   సమీక్షా కాలంలో బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ. 20,729 కోట్ల నుంచి రూ. 20,271 కోట్లకు తగ్గింది. వడ్డీ ఆదాయం 6.33 శాతం క్షీణించి రూ. 17,820 కోట్ల నుంచి రూ. 16,692 కోట్లకు తగ్గింది.  వడ్డీయేతర ఆదాయం 23 శాతం పెరిగి రూ. 2,910 కోట్ల నుంచి రూ. 3,579 కోట్లకు చేరింది. మరోవైపు, ఇచ్చిన మొత్తం రుణాల్లో .. స్థూల నిరర్థక ఆస్తుల (ఎన్‌పీఏ) పరిమాణం 9.14 శాతం నుంచి 8.11 శాతానికి దిగి వచ్చింది. కానీ నికర ఎన్‌పీఏలు 2.51 శాతం నుంచి స్వల్పంగా పెరిగి 2.83 శాతానికి చేరాయి. మొండి బాకీలు తదితర అంశాలకు కేటాయింపులు రూ. 2,811 కోట్ల నుంచి రూ. 2,754 కోట్లకు తగ్గాయి.  

బీఎస్‌ఈలో బుధవారం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేరు   5 శాతం క్షీణించి రూ. 100.65 వద్ద క్లోజయ్యింది.

మరిన్ని వార్తలు