బీవోబీ, యూ గ్రో నుంచి ప్రథమ్‌ రుణాలు

23 Jul, 2021 04:53 IST|Sakshi

రూ. 50 లక్షల నుంచి 2.5 కోట్లు

ప్రారంభ వడ్డీ రేటు 8 శాతం

ఎంఎస్‌ఎంఈలకు ఆర్థిక దన్ను

న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీవోబీ) తాజాగా ఫిన్‌టెక్‌ కంపెనీ యూ గ్రో క్యాపిటల్‌తో చేతులు కలిపింది. తద్వారా ప్రథమ్‌ పేరుతో రుణాలను అందించనుంది. యూ గ్రో క్యాపిటల్‌ సహకారంతో ఎంఎస్‌ఎంఈ రంగంలోని సంస్థలకు రూ. 1,000 కోట్లను రుణాలుగా విడుదల చేయనున్నట్లు బీవోబీ తెలియజేసింది. బీవోబీ 114వ వ్యవస్థాపక దినోత్సవం నేపథ్యంలో ప్రథమ్‌ పేరిట రుణాల జారీని చేపట్టినట్లు చిన్న సంస్థలకు రుణాలందించే టెక్‌ ఆధారిత ప్లాట్‌ఫామ్‌.. యూ గ్రో క్యాపిటల్‌ పేర్కొంది.

సహరుణ విడుదల కార్యక్రమంలో భాగంగా ఎంఎస్‌ఎంఈలకు అవసరాలకు అనుగుణంగా(కస్టమైజ్‌డ్‌) రుణాలను పోటీస్థాయి వడ్డీ రేట్లతో అందించనున్నట్లు తెలియజేసింది. రూ. 50 లక్షల నుంచి ప్రారంభించి రూ. 2.5 కోట్ల వరకూ రుణాలను మంజూరు చేయనున్నట్లు వివరించింది. 8 శాతం నుంచి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లతో గరిష్టంగా 120 నెలల కాలావధితో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. కాగా.. సహరుణ కార్యక్రమం ద్వారా ఎంఎస్‌ఎంఈ విభాగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు బీవోబీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ విక్రమాదిత్య సింగ్‌ కె. పేర్కొన్నారు. తద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు మరింత మద్దతివ్వనున్నట్లు తెలియజేశారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు