ఈ రూల్‌ ఫాలో కాకుంటే..! మీ చెక్‌ బౌన్స్‌ అయ్యే అవకాశం..!

3 Feb, 2022 18:06 IST|Sakshi

బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) తన ఖాతాదారులను అలర్ట్ చేసింది. ఫిబ్రవరి 1 నుంచి చెక్కు చెల్లింపుల వ్యవస్థలో కొత్త మార్పులు రానున్నట్లు ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం.. లబ్ధిదారులకు జారీ చేసిన చెక్కుల ముందస్తు సమాచారం అందించాలని బ్యాంకు ఖాతాదారులను అభ్యర్థించింది. "బీఓబీ కస్టమర్లు లబ్ధిదారులకు జారీ చేసిన చెక్కుల గురుంచి ముందస్తు సమాచారం ముందస్తు సమాచారం అందించాలి. తద్వారా సీటిఎస్ క్లియరింగ్ సమయంలో బ్యాంక్ బేస్ బ్రాంచ్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ ఫోన్ కాల్ లేకుండానే హై వాల్యూ చాక్‌లను ప్రాసెస్ చేయనున్నట్లు" బీఓబీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం బీఓబీ ఈ కొత్త రూల్స్ అమలులోకి తీసుకొని వచ్చింది. చెక్కు మోసాలను అరికట్టడం కోసం జనవరి 1, 2021 నుంచి కొత్త వ్యవస్థను అమలు చేయాలని బ్యాంకులకు ఆర్‌బిఐ మార్గదర్శకాలను జారీ చేసింది. "చెక్కు చెల్లింపులలో కస్టమర్ భద్రతను మరింత పెంచడానికి, చెక్కులను ట్యాంపరింగ్ చేయడం వల్ల జరిగే మోసలను తగ్గించడానికి, రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన అన్ని చెక్కులకు పాజిటివ్ పే యంత్రాంగాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు" అని ఆర్‌బీఐ పేర్కొంది.

పాజిటివ్ పే సిస్టమ్ అంటే ఏమిటి?
పాజిటివ్ పే సిస్టమ్ ప్రకారం.. ఖాతాదారుడు ఎవరైనా లబ్ధిదారుడికి చెక్కుజారీ చేసిన తర్వాత ఆ చెక్కు వివరాలను తమ బ్యాంకుతో పంచుకోవాల్సి ఉంటుంది. బ్యాంకుతో పంచుకోవలసిన వివరాలలో చెక్కు నెంబరు, చెక్కు తేదీ, పేయీ పేరు, ఖాతా నెంబరు, మొత్తం మొదలైనవి ఉంటాయి. ఖాతాదారులు లబ్ధిదారుడికి చెక్కు ఇచ్చే ముందు ఆ చెక్ ముందు, వెనుక వైపు ఫోటోలు తీసి బ్యాంకుకు పంపాల్సి  ఉంటుంది. లబ్ధిదారునికి చెల్లింపు చేసే ముందు, ఖాతాదారుడు ఇచ్చిన చెక్కుపై అన్ని వివరాలను బ్యాంకు క్రాస్ చెక్ చేస్తుంది. ఒకవేళ వివరాలు జత అయితే, అప్పుడు చెక్కు క్లియర్ చేస్తుంది. సీటీఎస్‌ ద్వారా ఏదైనా అవకతవకలు గుర్తిస్తే బ్యాంక్ తగిన చర్యలు తీసుకుంటుంది. 

(చదవండి: మరో సూపర్ కంప్యూటర్‌ను అభివృద్ది చేసిన సీ-డీఏసీ)

మరిన్ని వార్తలు