పటిష్ట బాటన భారత్‌ ఎకానమీ..!

26 Aug, 2022 06:25 IST|Sakshi

క్యూ1లో పటిష్ట స్థాయిలో   14.2 శాతం రుణ వృద్ధి

ఆర్‌బీఐ గణాంకాల వెల్లడి  

ముంబై: బ్యాంకింగ్‌ రుణ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) 14.2 శాతం నమోదయినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గణాంకాలు వెల్లడించాయి. 2021 ఇదే కాలంలో బ్యాంకింగ్‌ రుణ వృద్ధి 6 శాతం. గడచిన త్రైమాసికం (2022 జనవరి–మార్చి)లో ఈ రేటు 10.8 శాతంగా ఉంది. ఎకానమీ పురోగమన బాటలో ఉందనడానికి తాజా గణాంకాలు నిదర్శనమని నిపుణులు భావిస్తున్నారు.

ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను ఆర్‌బీఐ మే నెల నుంచి ఆగస్టు వరకూ 1.40 (ప్రస్తుతం 5.40 శాతం) పెంచింది. ఇందులో జూన్‌ వరకూ పెరిగిందే 90 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం). ఈ పరిస్థితుల్లో బ్యాంకింగ్‌సైతం రుణ రేట్లను పెంచడం ప్రారంభించింది. అయినప్పటికీ పటిష్ట స్థాయిలో రుణ వృద్ధి రేటు నమోదుకావడాన్ని చూస్తే, వ్యవస్థలో డిమాండ్‌ పరిస్థితులు బాగున్నాయని స్పష్టమవుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘జూన్‌ త్రైమాసిక రుణ, డిపాజిట్‌ వృద్ధి 2022’ శీర్షికన ఆర్‌బీఐ విడుదల చేసిన గణాంకాలకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే...

► ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు, పేమెంట్స్‌ బ్యాంకులుసహా అన్ని షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల నుంచి సమీకరించిన సమాచారం ఆధారంగా తాజా గణాంకాలు రూపొందాయి.
► దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో విస్తృత ప్రాతిపదికన రుణ వృద్ధి  నమోదయ్యింది.  
►  గడచిన ఐదు త్రైమాసికాల్లో డిపాజిట్‌ వృద్ధి రేటు 9.5 శాతం నుంచి 10.2 శాతం శ్రేణిలో ఉంది.
► జూన్‌ త్రైమాసికంలోని దేశ వ్యాప్తంగా మొత్తం డిపాజిట్లలో కరెంట్, సేవింగ్‌స అకౌంట్‌ (సీఏఎస్‌ఏ) నిష్పత్తి 73.5 శాతం. గత ఏడాది ఇదే సమయంలో ఈ నిష్పత్తి 70.5 శాతం. ఒక్క  మొట్రోపాలిటన్‌ బ్రాంచీల్లో ఈ నిష్పత్తి వార్షికంగా చూస్తే 84.3 శాతం నుంచి 86.2 శాతానికి పెరిగింది.

లిస్టెడ్‌ ప్రైవేటు కంపెనీల అమ్మకాలు 41 శాతం అప్‌
కాగా లిస్టెడ్‌ నాన్‌–ఫైనాన్స్‌ ప్రైవేటు కంపెనీల అమ్మకాలు జూన్‌ త్రైమాసికంలో 41 శాతం పెరిగి రూ.14.11 కోట్లుగా నమోదయినట్లు ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడించాయి. 2021 ఇదే కాలంలో ఈ అమ్మకాల్లో 60.6 శాతం వృద్ధి నమోదుకాగా, 2022 జనవరి–మార్చిలో ఈ రేటు 22.3 శాతంగా ఉంది. 

మరిన్ని వార్తలు