బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర లాభం రెట్టింపు!

19 Jul, 2022 08:24 IST|Sakshi

ముంబై: ప్రభుత్వరంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో మంచి పనితీరు ప్రదర్శించింది. స్టాండలోన్‌ లాభం రెట్టింపునకు పైగా పెరిగి రూ.452 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.208 కోట్లు కావడం గమనించాలి.

లాభంలో 117 శాతం వృద్ధిని చూపించినట్టు బ్యాంకు ఎండీ, సీఈవో ఏఎస్‌ రాజీవ్‌ తెలిపారు. ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు ఉన్నా కానీ తాము మంచి ఫలితాలను సాధించినట్టు చెప్పారు. సెప్టెంబర్‌ త్రైమాసికం నుంచి అధిక వృద్ధిని అంచనా వేస్తున్నామని, భవిష్యత్తు వృద్ధి పట్ల ఎంతో సానుకూలంగా ఉన్నామని ప్రకటించారు.

నికర వడ్డీ ఆదాయం 20 శాతానికి పైగా పెరిగి రూ.1,686 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్‌ 3.05 శాతం నుంచి 3.28 శాతానికి పుంజుకుంది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏలు) 6.35 శాతం నుంచి 3.74 శాతానికి తగ్గగా, నికర ఎన్‌పీఏలు 2.22 శాతం నుంచి 0.88 శాతానికి పరిమితమయ్యాయి. తాజాగా రూ.697 కోట్ల రుణాలు ఎన్‌పీఏల జాబితాలోకి చేరాయి.    

మరిన్ని వార్తలు