బ్యాంకులపై ‘మొండి’బండ!

18 Mar, 2021 15:04 IST|Sakshi

2021 తొలి ఆరు నెలలపై ఫిక్కీ-ఐబీఏ సర్వే

ముంబై: బ్యాంకింగ్‌ మొండిబకాయిల (ఎన్‌పీఏ) సమస్య 2020 రెండవ అర్థ భాగంలో కొంత మెరుగుపడినప్పటికీ, 2021 మొదటి ఆరు నెలల కాలంలో సమస్య మళ్లీ కొంత తీవ్రమయ్యే అవకాశం ఉందని ఫిక్కీ-ఐబీఏ సర్వే ఒకటి పేర్కొంది. జూలై-డిసెంబర్‌ 2020 మధ్య ఫిక్కీ-ఐబీఏ నిర్వహించిన 12వ దఫా బ్యాంకర్ల సర్వేలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... 

  • మొత్తం 20 బ్యాంకులను సర్వేకు ప్రాతిపదికగా తీసుకోవడం జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు విదేశీ బ్యాంకులు వీటిలో ఉన్నాయి. మొత్తం బ్యాంకింగ్‌ రంగంలో దాదాపు 59 శాతం మంది తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.  
  • 2020 చివరి ఆరు నెలల్లో మొండిబకాయిలు తగ్గాయని సగం మంది ప్రతినిధులు పేర్కొన్నారు.  ప్రభుత్వ రంగంలో ఎన్‌పీఏలు తగ్గాయని చెప్పిన వారి శాతం 78గా ఉంది.  
  • 2021 మొదటి ఆరు నెలల్లో ఎన్‌పీఏలు 10 శాతం పైగా పెరిగే అవకాశం ఉందని దాదాపు 68 శాతం మంది తెలిపారు. ఇది ఏకంగా 12 శాతందాటిపోతుందని అంచనావేస్తున్న వారి శాతం 37గా ఉంది.  
  • పర్యాటక, ఆతిథ్యం, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు(ఎంఎస్‌ఎంఈ), పౌర విమానయానం, రెస్టారెంట్ల విభాగాల్లో అధిక ఎన్‌పీఏల ప్రభావం ఉంటుందని మెజారిటీ ప్రతినిధులు తెలిపారు. 
  • రవాణా, ఆతిథ్య రంగాల్లో ఎన్‌పీఏలు భారీగా పెరిగిపోతుందని అంచనావేస్తున్నవారు 55 శాతంగా ఉన్నారు. 45 శాతం మంది ఈ రంగంలో ఎన్‌పీఏల భారం కొద్దిగానే ఉంటుందని భావిస్తున్నారు. ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి భారీ ఎన్‌పీఏల భారం ఉంటుందని దాదాపు 84 శాతం అంచనావేయడం గమనార్హం. రెస్టారెంట్ల విషయంలో ఈ శాతం 89గా ఉంది. ఈ విభాగంలో ఎన్‌పీఏల భారం అంతంతే అన్న అంచనావేసినవారు 26 శాతంమందే.  
  • ఎంఎస్‌ఎంఈలో ఒన్‌టైమ్‌ రుణ పునర్‌వ్యవస్థీకరణకు (గత ఏడాది ఆగస్టులో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించిన) విజ్ఞప్తులు గణనీయంగా పెరుగుతాయి.  
  • మౌలిక, ఔషధ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాల్లో దీర్ఘకాలిక రుణ డిమాండ్‌ పెరుగుతుంది. ఫార్మా రంగానికి రుణ డిమాండ్‌ పెరుగుతుందన్న అంచనాల విషయంలో 11వ దఫా సర్వేలో 29 శాతం మంది సానుకూలంగా స్పందిస్తే, 12వ దఫా సర్వేలో ఇది 45 శాతానికి పెరిగింది.  
  • ఒన్‌-టాప్‌ టార్గెటెడ్‌ లాంగ్‌ టర్మ్‌ రెపో ఆపరేషన్స్‌ కింద తాము నిధులు పొందలేదని మెజారిటీ ప్రతినిధులు సర్వేలో తెలిపారు. నాన్‌  బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు, మైక్రో ఫైనాన్స్‌ కంపెనీలు జారీ చేసిన సెక్యూరిటీల్లోకి దాదాపు టీఎల్‌టీఆర్‌ఓ నిధులు వెళ్లాయని 33 శాతం మంది పేర్కొన్నారు.  

2021 సెప్టెంబర్‌ నాటికి 13.5 శాతం! 
కోవిడ్‌-19 ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో భారత్‌ బ్యాంకింగ్‌పై మొండిబకాయిల(ఎన్‌పీఏ) భారం తీవ్రతరం కానుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్వైవార్షిక ద్రవ్య స్థిరత్వ నివేదిక (ఎఫ్‌ఎస్‌ఆర్‌) పేర్కొంటోంది. ఎన్‌పీఏలకు సంబంధించి కనిష్ట ప్రభావం మేరకు చేసినా, మొత్తం రుణాల్లో  మొండిబకాయిల భారం 2021 సెప్టెంబర్‌ నాటికి 13.5 శాతానికి చేరుతుందని  నివేదిక పేర్కొంది. ప్రభావం తీవ్రంగా ఉంటే ఏకంగా ఇది 14.8 శాతానికి ఎగసే అవకాశం ఉందని తెలిపింది. ఇదే జరిగితే గడచిన 25 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత తీవ్ర మొండిబకాయిల భారం బ్యాంకింగ్‌పై ఉంటుంది. 2020 సెప్టెంబర్‌ నాటికి బ్యాంకింగ్‌పై ఎన్‌పీఏ భారం 7.5 శాతం.

చదవండి:

ఆయుధాల తయారీలో స్వావలంబన దిశగా భారత్

మరిన్ని వార్తలు