ఒకటికి మించి బ్యాంక్‌ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్‌!

25 Sep, 2022 13:50 IST|Sakshi

ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్‌ అకౌంట్లు ఉపయోగిస్తున్నారా లేదా వాడుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు గమనించాలి లేదంటే ఇబ్బందులు తప్పవని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. బ్యాంక్‌ ఖాతా అంటే నగదును దాచుకోవడం , అవసరం ఉన్నప్పుడు నగదు విత్‌డ్రా చేసి వాడుకోవడం, మరి కొందరు ఫిక్స్‌డ్‌ డిపాట్లలో వచ్చే వడ్డీ కోసం ఉపయోగిస్తుంటారు. టెక్నాలజీ పెరిగే కొద్దీ బ్యాంకింగ్ సంస్థలు తమ సేవల పరిధిని పెంచుకుంటూ పోయాయి.

ఈ నేపథ్యంలో కొన్ని సేవలకు ఛార్జీలు కూడా విధిస్తున్నాయి. ప్రస్తుత రోజుల్లో కస్టమర్లు అనుకోకుండా ఒకటికి మించి బ్యాంక్‌ అకౌంట్లను కలిగి ఉన్నారు. ఇలా ఎక్కువ ఖాతాలను నిర్వహించడం వల్ల ముఖ్యంగా సామాన్య  ప్రజలు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటో ఓ లుక్కేద్దాం..

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక బ్యాంక్ అకౌంట్‌ను నిర్వహించడం సులభం పైగా మీరు మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేస్తున్నప్పుడు, మీ బ్యాంకింగ్ వివరాలు ఒకే బ్యాంకు ఖాతాలో అందుబాటులో ఉన్నందున మీ పని సులభం అవుతుంది. అయితే తప్పక అధిక బ్యాంక్‌ ఖాతాలు ఉపయోగించాల్సి వస్తే.. బ్యాంక్‌ సేవలు, ఛార్జీలు తెలుసుకునే కొత్త అకౌంట్లు ఓపెన్‌ చేస్తే మంచిదని సూచిస్తున్నారు.

సిబిల్‌(CIBIL) రేటింగ్‌కు ప్రమాదం
ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్‌ అకౌంట్లను ఉపయోగించడం వల్ల మీ బ్యాంక్ ఖాతాను సరైన మినిమం బ్యాలెన్స్‌తో నిర్వహించడంలో ఒక్కో సారి కుదరకపోవచ్చు. అటువంటి సందర్భాలలో దాని ప్రభావం మీ సిబిల్‌( CIBIL ) రేటింగ్‌పై చూపుతుంది.

సర్వీస్‌ ఛార్జీలు అధికం
బ్యాంక్ ఖాతా కలిగిన ప్రతీ ఒక్క కస్టమర్‌ కూడా బ్యాంకులు విధించే ఎస్‌ఎంఎస్‌ అలర్ట్ సర్వీస్ ఛార్జ్, డెబిట్ కార్డ్ ఏంఎంసీ మొదలైన వివిధ సేవా ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కస్టమర్లు ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్‌ అకౌంట్లు ఉపయోగిస్తుంటే వారు ఖచ్చితంగా మిగిలిన ఖాతాల ఛార్జీలను కూడా భరించాల్సిందే. అంతే కాకుండా  ఎక్కువ కాలం అకౌంట్‌ వాడకుంటే వివిధ ఛార్జీలు పడతాయి.

మినిమం బ్యాలెన్స్‌ ఉండాల్సిందే
బ్యాంక్ సేవింగ్స్ ఖాతాను కలిగి ఉండాలంటే మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించడం తప్పనిసరి. మీకు ఎక్కువ బ్యాంక్‌ అకౌంట్లు ఉన్నట్లయితే, మీ ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్‌ చేసి ఉంచాల్సి వస్తుంది. ప్రస్తుత రోజుల్లో బ్యాంకులు కస్టమర్ల ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే బాదుడు మొదలుపెడుతున్నాయి. అలాంటిది వేర్వేరు బ్యాంకుల్లో కనీస మొత్తంలో నగదుని నిల్వను నిర్వహించాలంటే సామాన్యుడికి ఇది భారమే తప్ప ఉపయోగకరం కాదని నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా ఎన్ని ఖాతాలు మనం ఉపయోగిస్తుంటే బ్యాంకులు విధించే ఛార్జీలు కూడా అదే స్థాయిలో ఉంటాయనే విషయాన్ని గమనించాలి.
చదవండి:Chennai: నగరజీవికి మోయలేని భారం.. తప్పక కట్టాల్సిందే గురూ!

మరిన్ని వార్తలు