బ్యాంక్‌ ఉద్యోగులకు 15 శాతం వేతన పెంపు

11 Nov, 2020 17:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బ్యాంకు ఉద్యోగులు, భారతీయ బ్యాంకుల అసోసియేషన్‌ (ఐబీఏ) మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకు ఉద్యోగులకు 15 శాతం వేతన పెంపును వర్తింపచేయనున్నారు. బ్యాంకు ఉద్యోగులకు వేతన పెంపుతో బ్యాంక్‌లపై ఏటా 7900 కోట్ల రూపాయల భారం పడనుంది. వేతన పెంపును బకాయిలతో సహా నవంబర్‌ జీతంతో ఉద్యోగులు అందుకోనున్నారు. వేతనాల పెరుగుదలతో దాదాపు 5 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.ఇంక్రిమెంట్‌ బకాయిలను ఈనెల 1 నుంచి విడుదల చేస్తారని బ్యాంకు అధికారుల యూనియన్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

బ్యాంకు ఉద్యోగుల్లో పోటీతత్వాన్ని పెంచడంతో పాటు సామర్ధ్యం కనబరిచినవారిని ప్రోత్సహించే లక్ష్యంతో సామర్ధ్య ఆధారిత వేతనాల పద్ధతిని తొలిసారిగా ప్రవేశపెట్టామని ఐబీఏ ఓ ప్రకటనలో​ తెలిపింది. వేతన పెంపు సంప్రదింపుల్లో 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు, 10 ప్రైవేట్‌ బ్యాంకులు, 6 విదేశీ బ్యాంకుల ప్రతినిధులు, బ్యాంకు ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఇక కేంద్ర వేతన సంఘ సిఫార్సులను వర్తింపచేయాలని, వారానికి ఐదు రోజుల పని, కుటుంబ పెన్షన్‌ తాజాపరచడం వంటి మూడు ప్రధాన డిమాండ్లతో బ్యాంకు ఉద్యోగులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. అయితే తొలి రెండు డిమాండ్లపై ఆశించిన ఫలితాలు చేకూరలేదు. కుటుంబ పెన్షన్‌ పథకం డిమాండ్‌ను ప్రభుత్వానికి ప్రతిపాదించేందుకు ఐబీఏ అంగీకరించింది. ఇక ఈ పథకాన్ని బ్యాంకు ఉద్యోగులకు వర్తింపచేయడంపై కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది. చదవండి : గుడ్‌న్యూస్‌ : టెకీలకు వేతన పెంపు

మరిన్ని వార్తలు