దేశంలో భారీగా తగ్గిన బ్యాంక్‌ మోసాలు.. కారణాలివేనా?

4 Jul, 2022 13:11 IST|Sakshi

న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021–22) బ్యాంకింగ్‌ రంగంలో భారీ మోసాలు తగ్గుముఖం పట్టాయి. రూ. 100 కోట్లకుపైబడిన మోసాల విలువ రూ. 41,000 కోట్లకు పరిమితమమైంది. అంతక్రితం ఏడాది(2020–21)లో ఇవి ఏకంగా రూ. 1.05 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 

అధికారిక గణాంకాల ప్రకారం అటు ప్రయివేట్, ఇటు పబ్లిక్‌ బ్యాంకులలో కుంభకోణాల కేసులు 118కు తగ్గాయి. 2020–21లో ఇవి 265గా నమోదయ్యాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ)లను తీసుకుంటే రూ.100 కోట్లకుపైబడిన మోసాలకు సంబంధించిన కేసుల సంఖ్య 167 నుంచి 80కు క్షీణించింది. ప్రయివేట్‌ రంగంలోనూ ఇవి 98 నుంచి 38కు దిగివచ్చాయి. విలువరీత్యా చూస్తే గతేడాది పీఎస్‌బీలలో వంచన కేసుల విలువ రూ. 65,900 కోట్ల నుంచి రూ. 28,000 కోట్లకు తగ్గింది. ఇక ప్రయివేట్‌ బ్యాంకుల్లోనూ ఈ విలువ రూ. 39,900 కోట్ల నుంచి రూ. 13,000 కోట్లకు వెనకడుగు వేసింది. 

బ్యాంకింగ్‌ రంగ మోసాలకు చెక్‌ పెట్టే బాటలో రిజర్వ్‌ బ్యాంక్‌ పలు చర్యలు తీసుకుంటూ వస్తోంది. తొలినాళ్లలోనే హెచ్చరించే వ్యవస్థ(ఈడబ్ల్యూఎస్‌) మార్గదర్శకాలను మెరుగుపరచడం, ఫ్రాడ్‌ గవర్నెన్స్, స్పందన వ్యవస్థను పటిష్టపరచడం,లావాదేవీల పర్యవేక్షణ, గణాంకాల విశ్లేషణ, మోసాలను పసిగట్టేందుకు ప్రత్యేకించిన మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ ఏర్పాటు తదితరాలకు ఆర్‌బీఐ తెరతీసింది. 

మోసాల తీరిలా 
ఈ ఏడాది మొదట్లో స్టేట్‌బ్యాంక్‌(ఎస్‌బీఐ) దేశంలోనే అతిపెద్ద మోసానికి నెలవైంది. ఏబీజీ షిప్‌యార్డ్, కంపెనీ ప్రమోటర్లకు సంబంధించి రూ. 22,842 కోట్ల కుంభకోణం నమోదైంది. ఇది పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ)ను రూ. 14,000 కోట్ల మోసం చేసిన నీరవ్‌ మోడీ, మేహుల్‌ చోక్సీ కేసుకంటే పెద్దదికావడం గమనార్హం! ఇక గత నెలలో దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌(డీహెచ్‌ఎఫ్‌ఎల్‌), కంపెనీ మాజీ సీఎండీ కపిల్‌ వాధ్వాన్, డైరెక్టర్‌ ధీరజ్‌ వాధ్వాన్‌ తదితరులపై రూ. 34,615 కోట్ల ఫ్రాడ్‌ కేసును సీబీఐ బుక్‌ చేసిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు