బ్యాంకింగ్‌ సేవలు మరింతగా విస్తరించాలి

27 Sep, 2021 03:44 IST|Sakshi

ఐబీఏ ఏజీఎంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

ముంబై: అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తెచ్చేందుకు చాలాకాలంగా ప్రత్యేక కృషి జరుగుతున్నా ఇప్పటికీ బ్యాంకింగ్‌ సదుపాయం అందుబాటులో లేని జిల్లాలు దేశంలో చాలా ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వ్యాఖ్యానించారు. భారీ స్థాయిలో ఆర్థిక కార్యకలాపాలు జరిగే కొన్ని ప్రాంతాల్లో సైతం బ్యాంకింగ్‌ సరీ్వసులు లభించకపోతుండటం ఆశ్చర్యకరమని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్‌ సర్వీసులను మరింతగా విస్తరించేందుకు అన్ని బ్యాంకులు నడుం బిగించాలని మంత్రి సూచించారు.

ఆయా ప్రాంతాల్లో పూర్తి స్థాయి శాఖలనో లేదా కనీస సరీ్వసులైనా అందించే అవుట్‌పోస్ట్‌లనో ఏర్పాటు చేయాలని ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) 74వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో (ఏజీఎం)  ఆమె పేర్కొన్నారు. ‘‘నేటికీ పలు జిల్లాల్లో పెద్ద పంచాయతీల్లో కూడా బ్యాంకు శాఖ అనేది ఉండటం లేదు. ఇకనైనా ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రాలుగా ఉంటున్న ప్రాంతాలను గుర్తించడంపై దృష్టి పెట్టాలి. గ్రామీణ ప్రాంతమే కావచ్చు ఆర్థిక కార్యకలాపాలు పటిష్టంగా ఉన్న ప్రాంతాల్లో ఎంతో కొంతైనా బ్యాంకింగ్‌ సదుపాయాలు అందుబాటులో ఉండాలి కదా’’ అని మంత్రి వ్యాఖ్యానించారు.  

బ్యాడ్‌ బ్యాంక్‌ అని పిలవొద్దు..
మొండిబాకీల పరిష్కారానికి ఉద్దేశించిన నేషనల్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ఎన్‌ఏఆర్‌సీఎల్‌)ను ‘బ్యాడ్‌ బ్యాంక్‌’గా పిలవొద్దని నిర్మలా సీతారామన్‌ సూచించారు. ప్రస్తుతం బ్యాంకుల ఖాతాలు మరిం త మెరుగ్గా ఉన్నాయని, దీనితో వాటికి అదనంగా మూలధనం సమకూర్చాల్సిన అవసరం తగ్గుతుం దని, తద్వారా ప్రభుత్వంపైనా ఆ మేరకు భారం తగ్గుతుందని ఆమె తెలిపారు. అన్ని రకాల వ్యాపార సంస్థల అవసరాలను బ్యాంకులు గుర్తెరిగి, తగు రీతిలో సహాయాన్ని అందిస్తేనే 2030 నాటికి 2 లక్షల కోట్ల డాలర్ల ఎగుమతుల భారీ లక్ష్యాన్ని దేశం సాధించగలదని మంత్రి పేర్కొన్నారు.  

ఎస్‌బీఐ సైజు బ్యాంకులు నాలుగైదు ఉండాలి
పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ, పరిశ్రమ అవసరాలను తీర్చడానికి దేశీయంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ‘‘స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) స్థాయి’’ బ్యాంకులు 4–5 ఉండాలని నిర్మలా సీతారామన్‌  అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలికంగా డిజిటల్‌ ప్రక్రియలపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఆమె తెలిపారు. కాబట్టి, స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా భారతీయ బ్యాంకింగ్‌ ఎలా ఉండాలన్నది పరిశ్రమ వర్గాలు నిర్దేశించుకుని, తగు రూపం ఇవ్వాలని మంత్రి సూచించారు. వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియ సజావుగా సాగేలా బ్యాంకర్లు కృషి చేశారని  ప్రశంసించారు. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సమయంలోనూ విధులు నిర్వర్తిస్తూ, మహమ్మారికి బలైన బ్యాంకింగ్‌ సిబ్బందికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ఆర్థికమంత్రికి జ్ఞాపికను బహూకరిస్తున్న యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎండీ, సీఈఓ రాజ్‌కిరణ్‌

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు