మరింత తగ్గనున్న మొండిబాకీల భారం

22 Jul, 2022 07:51 IST|Sakshi

న్యూఢిల్లీ: బ్యాంకుల మొండిబాకీల భారం 2024 మార్చి నాటికి 5–5.5 శాతానికి దిగి వచ్చే అవకాశం ఉంది. రిజర్వ్‌ బ్యాంక్‌ తాజాగా విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదిక ప్రకారం 2022 మార్చి నాటికి స్థూల నిరర్ధక ఆస్తుల (జీఎన్‌పీఏ) పరిమాణం ఆరేళ్ల కనిష్ట స్థాయి అయిన 5.9 శాతానికి తగ్గింది. 

ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్న నేపథ్యంలో వివిధ రంగాల్లో నెలకొన్న ఒత్తిడి క్రమంగా తగ్గి, మొండి బాకీల రికవరీలు కూడా పెరగనున్నాయి. రేటింగ్‌ ఏజెన్సీ ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. అలాగే 2023 ఆర్థిక సంవత్సరంలో రుణ వ్యయాలు 1.5 శాతం స్థాయిలో స్థిరపడగలవని, అటుపైన 1.3 శాతానికి తగ్గొచ్చని పేర్కొంది. ఇతర వర్ధమాన మార్కెట్లు, భారత్‌ 15 ఏళ్ల సగటు స్థాయికి రుణ వ్యయాలు సర్దుబాటు కావొచ్చని తెలిపింది. వడ్డీ రేట్ల పెరుగుదల, అధిక ద్రవ్యోల్బణంతో చిన్న, మధ్య తరహా సంస్థలు, అల్పాదాయ కుటుంబాలపై పరిమిత స్థాయిలో ప్రతికూల ప్రభావం పడొచ్చని ఎస్‌అండ్‌పీ వివరించింది.  

మెరుగ్గా వృద్ధి అంచనాలు .. 
మధ్యకాలికంగా చూస్తే భారత్‌ ఆర్థిక వృద్ధి అవకాశాలు పటిష్టంగానే ఉండగలవని ఎస్‌అండ్‌పీ పేర్కొంది. 2024–26 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి వార్షికంగా 6.5–7 శాతం స్థాయిలో నమోదు కావచ్చని వివరించింది.  జనాభా, చౌకగా కార్మిక శక్తి లభ్యత తదితర అంశాలు ఇందుకు దోహదపడగలవని పేర్కొంది. 

అంతే గాకుండా ఆర్థిక వ్యవస్థకు కేంద్రం బాసటగా నిలుస్తుందని, అలాగే రెండు బ్యాంకుల ప్రైవేటీకరణ యోచన ఉన్నప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకులకు మద్దతును కొనసాగించే అవకాశాలు ఉన్నాయని ఎస్‌అండ్‌పీ వివరించింది. రాబోయే రోజుల్లో జీడీపీకి అనుగుణంగా రుణ వృద్ధి ఉండగలదని, కార్పొరేట్‌ రంగంతో పోలిస్తే రిటైల్‌ రంగాలకు రుణాల్లో వృద్ధి అధికంగా ఉండే ధోరణులు కొనసాగవచ్చని పేర్కొంది. రుణ వ్యయాలు తగ్గడం, రుణ వృద్ధి మెరుగుపడుతుండటం వంటి అంశాలు బ్యాంకుల ఆదాయాలకు దన్నుగా నిలవొచ్చని ఎస్‌అండ్‌పీ వివరించింది.   

మరిన్ని వార్తలు