చిన్న పరిశ్రమలకు రుణ సౌలభ్యం

1 Aug, 2020 06:24 IST|Sakshi

అత్యవసర రుణ పథకం కింద  బ్యాంకింగ్‌కు ఆర్థికమంత్రి స్పష్టీకరణ

న్యూఢిల్లీ: అత్యవసర రుణ హామీ పథకం (ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ గ్యారంటీ స్కీమ్‌– ఈసీఎల్‌జీఎస్‌) పరిధిలోకి వచ్చే లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) రుణాల మంజూరీని నిరాకరించవద్దని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ బ్యాంకింగ్‌కు శుక్రవారం స్పష్టంచేశారు. ఇలాంటి పరిస్థితి ఏ సంస్థకైనా ఎదురైతే ఆ విషయాన్ని తమ దృష్టికి తీసుకురావాలని కూడా  ఆమె కోరారు.

వివరాల్లోకి వెళితే... . మేలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన రూ.20.97 లక్షల కోట్ల ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ (స్వావలంబన భారత్‌)   ప్యాకేజ్‌లో  ఈసీఎల్‌జీఎస్‌ ఒక భాగంగా ఉంది.  కోవిడ్‌–19 నేపథ్యంలో ఏర్పడిన మందగమన పరిస్థితుల్లో చిక్కుకున్న లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఈ స్కీమ్‌ కింద మొత్తం  రూ.3 లక్షల కోట్లను అందించాలన్నది ప్యాకేజ్‌ ఉద్దేశం. 

జూలై 23 వరకూ ఈ పథకం కింద ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు రూ.1,30,492 కోట్లను మంజూరు చేశాయి. ఇందులో 82,065 కోట్లను పంపిణీ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇండస్ట్రీ చాంబర్‌– ఫిక్కీ నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆర్థికమంత్రి  ఈ విషయాన్ని  ప్రస్తావించారు. ‘అత్యవసర రుణ సౌలభ్యం కిందకు వచ్చే ఎంఎస్‌ఎంఈలకు  రుణాల మంజూరీని బ్యాంకులు తిరస్కరించలేవు. 

ఒకవేళ అలా జరిగితే ఫిర్యాదు చేయండి. నేను ఆ విషయాన్ని పరిశీలిస్తాను’’ అని నిర్మలా సీతారామన్‌ ఈ సమావేశంలో పేర్కొన్నారు. ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల జీఎస్‌టీ రేటు తగ్గింపుపై జీఎస్‌టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి వెల్లడించారు.  పరస్పర ప్రయోజనాలే లక్ష్యంగా ఇతర దేశాలతో వ్యాపార సంబంధాలు ఉంటాయని ఆర్థికమంత్రి  ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు ఫిక్కీ వెల్లడించింది.  

మారటోరియం పెంపు అవకాశం
రుణాల పునఃచెల్లింపులకు సంబంధించి మార్చి నుంచి ఆగస్టు వరకూ అమలులో ఉన్న బ్యాంకింగ్‌ రుణ మారటోరియం కాలపరిమితిని మరింత పెంచే అంశంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)తో చర్చిస్తున్నట్లు ఆర్థికమంత్రి ఈ సందర్భంగా తెలిపారు. దీనితోపాటు ఆతిథ్య పరిశ్రమకు  రుణ పనర్‌వ్యవస్థీకరణ అంశంపైనా ఆర్‌బీఐతో మాట్లాడుతున్నట్లు వెల్లడించారు.

‘‘ఆతిథ్య రంగం అవసరాలను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. మారటోరియం పెంపుకానీయండి లేదా రుణ పునర్‌వ్యవస్థీకరణ కానీయండి. ఆయా అంశాలపై ఆర్‌బీఐతో కేంద్రం చర్చిస్తోంది’’ అని ఆర్థికమంత్రి పేర్కొన్నారు. ‘‘ప్రస్తుత ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనడానికి ప్రభుత్వం తగిన అన్ని చర్యలూ తీసుకుంటుంది. చర్యలు తీసుకునే ముందు సంబంధిత పారిశ్రామిక రంగాలతో సంప్రతింపులు జరుపుతుంది’’ అని ఆర్థికమంత్రి పేర్కొన్నట్లు పిక్కీ ఒక ట్వీట్‌లో వెల్లడించింది.   

మరిన్ని వార్తలు