బ్యాంకులకు కీలక సూచనలు చేసిన ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీ

29 Jun, 2021 07:16 IST|Sakshi

తక్కువ మార్జిన్లతో బ్యాంకింగ్‌ పనిచేయాలి

ప్రస్తుత ఎకానమీకి ఇది అవసరం

ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీ రాధాకృష్ణన్‌ సూచన 

కోల్‌కతా: భారత్‌ బ్యాంకింగ్‌ తక్కువ నికర మార్జిన్లతో (ఎన్‌ఐఎం) పనిచేయాల్సిన అవసరం ఉందని బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీఎస్‌ రాధాకృష్ణన్‌ సూచించారు. ఎంసీసీఐ నిర్వహించిన ఒక వెబినార్‌లో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం బ్యాంకింగ్‌ నికర మార్జిన్లు 3 నుంచి 3.5 శాతం శ్రేణిలో ఉన్నాయని, దీనికన్నా తక్కువ మార్జిన్లతో పనిచేయగల సామర్థాన్ని బ్యాంకులు పెంపొందించుకోవాలని సూచించారు.

అధిక మార్జిన్లు బ్యాంకింగ్‌కు మంచిదేఅయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఎకానమీ పురోగతికి తక్కువ మార్జిన్ల వ్యవస్థ చాలా అవసరమని అన్నారు. ఇందుకు తగిన వ్యవస్థ రూపకల్పన జరగాలనీ సూచించారు. అధిక మార్జిన్ల వల్ల రుణ రేట్ల భారం పెరుగుతోందన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... 

  • బ్యాంకింగ్‌ మరింత మారుమూల ప్రాంతాలకు విస్తరించాలి. ఇందుకు వీలుగా నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ), ఫిన్‌టెక్‌ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకోవాలి. 
  • బడా కార్పొరేట్ల నుంచి రుణ వృద్ధి రేటు తక్కువ గా ఉండడం ఆందోళనకరం. పలు కంపెనీలు తమ నిధుల అవసరాలకు ఈక్విటీ మార్కెట్లవైపు లేక కీలకం కాని ఆస్తుల విక్రయంపై దృష్టి       సారిస్తున్నాయి.  
  • బ్యాంకింగ్‌ మొండిబకాయిల (ఎన్‌పీఏ) సమస్య మరో ఆందోళన కరమైన సవాలు. కోవిడ్‌–19 మహమ్మారి వాస్తవ ఎకానమీ పరిస్థితులను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్‌ నాటికి మొత్తం రుణాల్లో ఎన్‌పీఏల శాతం 13.5 శాతానికి చేరుతుందని 2020 డిసెంబర్‌లో ఆర్‌బీఐ విడుదల చేసిన ద్రవ్య స్థిరత్వ నివేదిక అంచనావేసిన సంగతి తెలిసిందే. పరిస్థితి విషమిస్తే, ఇది 14.8 శాతం వరకూ వెళ్లే అవకాశం కూడా ఉందని విశ్లేషించింది.  
  • సెకండ్‌ వేవ్‌ వల్ల గ్రామీణ డిమాండ్‌ తీవ్రంగా దెబ్బతింది. వినియోగ సెంటిమెంట్‌ బలహీనమైంది. అనేకమంది ప్రజలు ఉద్యోగాలు కూడా కోల్పోయారు.  
  • ద్రవ్యోల్బణం సమస్య ఉన్నా, ఈ సవాళ్లను అధిగమిస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సరళతర ద్రవ్య పరపతి విధానాన్ని కొనసాగిస్తుందని విశ్వసిస్తున్నాం.  
  • దేశంలో కరోనా ప్రభావం కనిష్ట స్థాయికి చేరే వర కూ తగిన సరళతర ద్రవ్య, పరపతి విధానాలనే అనుసరిస్తామని ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ  భరోసా ఇచ్చింది.  బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను ఈ నెల ప్రారంభంలో వరుసగా ఆరవ ద్వైమాసిక సమావేశంలోనూ యథాతథంగా 4 శాతంగా కొనసాగించాలని ఎంపీసీ నిర్ణయించింది.  

    మార్చి 2020 తర్వాత 115 బేసిస్‌ పాయింట్లు రెపోను తగ్గించిన ఆర్‌బీఐ, కరోనా కష్ట కాలం దేశానికి ప్రారంభమైన తర్వాత యథాతథ రేటును కొనసాగిస్తూ వస్తోంది.   కేంద్రం నిర్దేశాలకు (2 నుంచి 6 శాతం మధ్య) అనుగుణంగా 2021–22లో రిటైల్‌  ద్రవ్యోల్బణం సగటున 5.1 శాతంగా కొనసాగుతుందని అంచనావేసింది. రెపో రేటుకు ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం మొదటి, రెండవ, మూడవ, నాల్గవ త్రైమాసికాల్లో వరుసగా 5.2 శాతం, 5.4 శాతం, 4.7 శాతం, 5.3 శాతంగా కొనసాగుతాయన్నది ఆర్‌బీఐ అంచనా. 

  • వ్యవస్థలో డిమాండ్‌ భారీగా పెరగడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి.  
  • ఆర్థిక వ్యవస్థ పురోగతిలో మౌలిక రంగం కీలక పాత్ర పోషిస్తుంది. విదేశీ పెట్టుబడిదారులు ఈ రంగంలో భారీ పెట్టుబడులకు అవకాశం ఉంది. 

ఎన్‌బీఎఫ్‌సీలపై ఎన్‌పీఏల ఒత్తిడి: ఇక్రా 

నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలపై (ఎన్‌బీఎఫ్‌సీ) రుణ ఒత్తిడి మరింత పెరిగే అవకాశం ఉందని దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ– ఇక్రా అంచనావేస్తోంది. ఒత్తిడిలో ఉన్న రుణ నాణ్యత మరింత క్షీణించే అవకాశం ఉందని విశ్లేషించింది. ఇక్రా నివేదిక ప్రకారం, ఎన్‌బీఎఫ్‌సీలు మంజూరుచేసిన రుణాల్లో 30 శాతం ఇబ్బందికరమైన విభాగాల్లో ఉన్నాయి. రియల్టీ, వ్యక్తిగత రుణాలు, సూక్ష్మ రుణాలు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, వాణిజ్య, పాసింజర్‌ వాహన విభాగాలకు రుణాలు వీటిలో ఉన్నాయి.  రంగాలవారీగా చూస్తే, 40 శాతం ఎన్‌బీఎఫ్‌సీల రుణాలు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి పెద్ద రాష్టాల్లో మంజూరయ్యాయి.

ఇవన్నీ కరోనా సెకండ్‌ వేవ్‌లో తీవ్రంగా దెబ్బతిన్న రాష్ట్రాలు కావడం గమనార్హం. ఎన్‌బీఎఫ్‌సీలకు ఇప్పటికే  పెరిగిన నిరర్ధక ఆస్తుల నిష్పత్తి 2021–22 ఆర్థిక సంవత్సరంలో మరో ఒక శాతం వరకు పెరుగుతుందని అంచనా. కోవిడ్‌–19 సెకండ్‌వేవ్‌ దీనికి ప్రధాన కారణం. ఇంతక్రితం ఎన్‌బీఎఫ్‌సీల రుణ వృద్ధి 8 నుంచి 10 శాతం ఉంటుందని ఇంతక్రితం వేసిన అంచనాలను తాజాగా 7 నుంచి 9 శాతం శ్రేణికి కుదిస్తున్నాం. అయితే ఈ శ్రేణికూడా 2020–21  ఆర్థిక సంవత్సరంలో జరిగిన 4 శాతం రుణ వృద్ధి కన్నా అధికం కావడం గమనార్హం.  

సెకండ్‌వేవ్‌ వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రుణ పంపిణీలు అనుకున్నమేరకు జరక్కపోవడం దీనికి కారణం. మార్చితో ముగిసిన త్రైమాసికంతో పోల్చితే రుణ పంపిణీలు ఏప్రిల్‌–జూన్‌ త్రైమాసికంలో 50 నుంచి 60 శాతం మేర పడిపోయే అవకాశం ఉంది.  ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం నుంచీ పరిస్థితి మెరుగుపడవచ్చు. అయితే మూడవ వేవ్‌ హెచ్చరికలు పొంచిఉన్న విషయాన్ని ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పెరుగుతున్న అవసరాలకోసం ఎన్‌బీఎఫ్‌సీలకు రూ.2 లక్షల కోట్ల నిధులు అవసరం.  

చదవండి: ఇక చిన్న సంస్థలకూ రేటింగ్స్‌

>
మరిన్ని వార్తలు