బ్యాంకుల్లో పాలన మెరుగుపడాలి

29 Dec, 2021 06:27 IST|Sakshi

ఆర్థిక వ్యవస్థ పుంజుకునే క్రమంలో సవాళ్లు

మూలధన నిధులను బలోపేతం చేసుకోవాలి

చెల్లింపుల వ్యవస్థ విజయానికి సీబీడీసీ కీలకం

వార్షిక నివేదికలో ఆర్‌బీఐ వెల్లడి

ముంబై: బ్యాంకుల్లో కార్పొరేట్‌గవర్నెన్స్‌ (పాలన) మరింత బలోపేతం కావాల్సిన అవసరాన్ని ఆర్‌బీఐ ప్రస్తావించింది. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకునే క్రమంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా తమ మూలధన నిధులను బలోపేతం చేసుకోవాలని, తగినన్ని నిల్వలు ఉండేలా చూసుకోవాలని సూచించింది. ‘భారత్‌లో బ్యాంకింగ్‌ ధోరణులు, పురోగతి 2020–21’ పేరుతో వార్షిక నివేదికను ఆర్‌బీఐ మంగళవారం విడుదల చేసింది. ‘‘కరోనా మహమ్మారి చూపించిన ప్రభావం వల్ల కార్పొరేట్, గృహాలు ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రభుత్వం, ఆర్‌బీఐ కలసికట్టుగా ఆర్థిక స్థిరత్వ సవాళ్లను కట్టడి చేయగలిగాయి. ఆర్థిక వ్యవస్థ కోలుకునే క్రమంలో వచ్చే సవాళ్లకు తగ్గట్టు బ్యాంకులు బ్యాలన్స్‌షీట్లను బలోపేతం చేసుకోవాలి’’అని అభిప్రాయపడింది.

ఆర్థిక వృద్ధిపైనే..
ఇకమీదట బ్యాంకు బ్యాలన్స్‌ షీట్లు పుంజుకోవడం అన్నది ఆర్థిక వృద్ధిపైనే ఆధారపడి ఉంటుందని ఆర్‌బీఐ పేర్కొంది. 2021–22లో ఇప్పటి వరకు చూస్తే రుణ వృద్ధి పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్‌ నాటికి ఆరు నెలల్లో డిపాజిట్లు 10 శాతం వృద్ధి చెందాయి. గతేడాది ఇదే కాలంలో ఇది 11 శాతం మేర ఉంది. షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల స్థూల ఎన్‌పీఏల నిష్పత్తి 2020 మార్చి నాటికి 8.2 శాతంగా ఉంటే, 2021 మార్చి నాటికి 7.3 శాతానికి తగ్గింది. 2021 సెప్టెంబర్‌ నాటికి 6.9 శాతానికి దిగొచ్చింది’’ అని వివరించింది.
సవాళ్లను అధిగమించేందుకు

వ్యూహాత్మక విధానం
భవిష్యత్తు సవాళ్లను అధిగమించేందుకు భారత ఆర్థిక వ్యవస్థకు శ్రద్ధతో కూడిన వ్యూహాత్మక విధానం అనుసరణీయమని ఆర్‌బీఐ పేర్కొంది. వాతావణం మార్పులు, టెక్నాలజీ ఆవిష్కరణలు, కరోనా మహమ్మారి కారణంగా ఎదురవుతున్న సవాళ్లను నివేదికలో ప్రస్తావించింది. వాతావరణ మార్పుల తాలూకు సంస్థాగత ప్రభావం ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక స్థిరత్వంపై ఏ మేరకు ఉంటుందో మదింపు చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. పర్యావరణ అనుకూల ప్రాజెక్టులకు రుణాలు (గ్రీన్‌ ఫైనాన్స్‌), ద్రవ్యోల్బణం, వృద్ధి తదితర స్థూల ఆర్థిక అంశాలపై వాతావరణ మార్పుల ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలుసుకునేందుకు అధ్యయనం చేస్తున్నట్టు వివరించింది.  

ఎన్‌బీఎఫ్‌సీలు నిలదొక్కుకోగలవు
రానున్న రోజుల్లో బ్యాంకిగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) నిలదొక్కుకుని బలంగా ముందుకు సాగుతాయన్న విశ్వాసాన్ని ఆర్‌బీఐ వ్యక్తం చేసింది. టీకాలు విస్తృతంగా ఇవ్వడం, ఆర్థిక వ్యవస్థ పుంజకుంటూ ఉండడం అనుకూలిస్తుందని పేర్కొంది. కరోనా మహమ్మారి ఎన్‌బీఎఫ్‌సీల సామర్థ్యాన్ని పరీక్షించినప్పటికీ.. ఈ రంగం బలంగా నిలబడి, తగినంత వృద్ధితో కొనసాగుతున్నట్టు తెలిపింది.  

కోపరేటివ్‌ బ్యాంకులు విస్తరించాలి
కరోనా మహమ్మారి కాలంలో పట్టణ, గ్రామీణ సహకార బ్యాంకింగ్‌ (కోపరేటివ్‌ బ్యాంకులు) రం గం బలంగా నిలబడినట్టు ఆర్‌బీఐ తెలిపింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకునే కొద్దీ ఇవి మరింత బలోపేతమై, విస్తరించాల్సి ఉందని పేర్కంది. వీటి నిధుల స్థాయి, లాభాలు మెరుగుపడినట్టు తెలిపింది.  

ప్రాథమిక నమూనాలోనే డిజిటల్‌ కరెన్సీ
సెంట్రల్‌ బ్యాంకు డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ) విషయంలో తొలినాళ్లలో ప్రాథమిక నమూనాతోనే వెళ్లడం సరైనదన్న అభిప్రాయంతో ఆర్‌బీఐ ఉంది. ‘సమగ్రంగా పరీక్షించాలి. అప్పుడే ద్రవ్య విధానం, బ్యాంకింగ్‌ వ్యవస్థపై ప్రభావం పరిమితంగా ఉంటుంది’ అని పేర్కొంది. నగదుకు ప్రత్యామ్నాయంగా సురక్షితమైన, బలమైన, సౌకర్యవంతమైన సాధనంగా ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది. పౌరులకు, ఆర్థిక సంస్థలకు ప్రతిష్టాత్మక సీబీడీసీని అందించడంపైనే భారత చెల్లింపుల పురోగతి ఆధారపడి ఉంటుందని పేర్కొంది.  

రూ.36,342 కోట్ల మోసాలు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొదటి ఆరు నెలల్లో బ్యాంకింగ్‌ రంగంలో  మోసాలకు సంబంధించి 4,071 కేసులు నమోదయ్యాయి. మోసపోయిన మొత్తం రూ.36,342 కోట్లుగా ఉందని ఆర్‌బీఐ తన నివేదికలో వెల్లడించింది. వీటిల్లో రుణ మోసాలే ఎక్కువగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో మోసపూరిత కేసులు 3,499తో పోలిస్తే పెరిగాయి. కానీ, గతేడాది మోసాల విలువ రూ.64,261 కోట్లతో పోలిస్తే సగం మేర తగ్గింది. వీటిని మరింత వివరంగా చూస్తే.. ‘‘2021–22 మొదటి ఆరు నెలల్లో రుణ మోసాలకు సంబంధించి 1,802 కేసులు నమోదు అయ్యాయి. వీటితో ముడిపడిన మొత్తం రూ.35,060 కోట్లు. కార్డు, ఇంటర్నెట్‌ రూపంలో మోసాలకు సంబంధించి నమోదైన కేసులు 1,532. వీటి విలువ రూ.60 కోట్లే’’ అని నివేదిక తెలియజేసింది. డిపాజిట్లకు సంబంధించి 208 మోసాలు నమోదైనట్టు, వీటి విలువ రూ.362 కోట్లుగా పేర్కొంది.

మరిన్ని వార్తలు