బ్యాంకులకు దండిగా వడ్డీ ఆదాయం

21 Feb, 2023 03:57 IST|Sakshi

డిసెంబర్‌ క్వార్టర్‌లో 25 శాతం వృద్ధి

రూ.1.78 లక్షల కోట్ల ఆదాయం

రుణాల్లో 18 శాతం వృద్ధి

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో బ్యాంకుల వడ్డీ ఆదాయం గణనీయంగా వృద్ధి చెందింది. 25.5 శాతం పెరిగి రూ.1.78 లక్షల కోట్లుగా నమోదైంది. ఇచ్చిన రుణాలపై అధిక మార్జిన్, అధికంగా రుణాల వితరణ దీనికి కలిసొచ్చింది. నికర వడ్డీ మార్జిన్‌ (నిమ్‌) 0.17 శాతం పెరిగి 3.28 శాతానికి చేరింది. ప్రస్తుత రుణాలపై రేట్లను పెంచడంతోపాటు, కొత్తగా ఇచ్చే రుణాలపైనా రేట్లు పెంచడం, డిపాజిట్‌ రేట్లను పెద్దగా మార్చకుండా అదే స్థాయిలో కొనసాగించడం వడ్డీ ఆదాయం వృద్ధికి సానుకూలించినట్టు కేర్‌ రేటింగ్స్‌ తెలిపింది. బ్యాంకుల ఆదాయంపై ఈ సంస్థ ఓ అధ్యయన నివేదికను విడుదల చేసింది.

నిమ్‌ వృద్ధిలో ప్రైవేటు బ్యాంకుల పాత్ర ఎక్కువగా ఉంది. మెరుగైన నిర్వహణ సామర్థ్యాల వల్ల ప్రైవేటు బ్యాంకుల నిమ్‌ 0.15 శాతం పెరిగి 4.03 శాతానికి చేరుకుంది. ప్రభుత్వరంగ బ్యాంకుల నిమ్‌ 0.17 శాతం వృద్ధితో 2.85 శాతంగా ఉంది. బ్యాంకులు సమీకరించిన డిపాజిట్లు/నిధులపై చెల్లించే రేటుకు, ఈ నిధులను రుణాలుగా ఇచ్చి వసూలు చేసే వడ్డీ రేటుకు మధ్య వ్యత్యాసమే నికర వడ్డీ మార్జిన్‌. పెద్ద బ్యాంకులు డిపాజిట్లపై అధిక రాబడులను ఆఫర్‌ చేయడం ఆరంభించాయని, రుణాలకు రెండంకెల స్థాయిలో డిమాండ్‌ ఉండగా, అదే స్థాయిలో డిపాజిట్లు రావడం లేదని క్రిసిల్‌ నివేదిక తెలిపింది. కనుక నిమ్‌ ఈ స్థాయిలో స్థిరపడొచ్చని అంచనా వేసింది. ఆర్‌బీఐ గతేడాది మే నుంచి 2.5 శాతం మేర పెరో రేటును పెంచడం తెలిసిందే.  

రుణాల్లో చక్కని వృద్ధి
డిసెంబర్‌ క్వార్టర్‌లో బ్యాంకులు రుణాల్లో 18.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. రుణ వితరణలో ప్రభుత్వరంగ బ్యాంకులది పైచేయిగా ఉంది. ప్రభుత్వరంగ బ్యాంకులు 18.9 శాతం అధికంగా రుణాలను మంజూరు చేయగా, ప్రైవేటు రంగ బ్యాంకుల రుణ వితరణలో 17.9 శాతం వృద్ధిని చూపించాయి. నికర వడ్డీ మార్జిన్‌లో మాత్రం ప్రభుత్వరంగ బ్యాంకుల కంటే ప్రైవేటు బ్యాంకుల పనితీరు మెరుగ్గా ఉంది. వడ్డీ వ్యయాలు ప్రైవేటు రంగ బ్యాంకులకు 27.3 శాతానికి పెరిగితే, ప్రభుత్వరంగ బ్యాంకులకు 22.6 శాతానికి చేరాయి. సగటు రుణ రేటు 1.2 శాతం పెరిగి 8.9 శాతంగా ఉంది. డిపాజిట్ల కోసం బ్యాంకుల మధ్య పోటీ ఉండడం, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపు నేపథ్యంలో రానున్న రోజుల్లో డిపాజిట్‌ రేట్లు పెరుగుతాయని అంచనా వేసింది. 12 ప్రభుత్వరంగ, 18 ప్రైవేటు రంగ బ్యాంకుల గణాంకాల ఆధారంగా కేర్‌ రేటింగ్స్‌ ఈ వివరాలను రూపొందించింది.

మరిన్ని వార్తలు